అమరావతిలో సింగపూర్ ‘పుంగోల్’ తరహా టౌన్‌షిప్.. గ్లోబల్ MICE హబ్‌గా ఏపీకి లోకేష్ ప్లాన్!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

Nara Lokesh సింగపూర్ పర్యటనలో కీలక ప్రకటనలు చేశారు. అమరావతిలో సింగపూర్‌లోని పుంగోల్ జిల్లా తరహాలో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను భారతదేశంలోనే మోడల్ టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

సింగపూర్‌లో జరిగిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (JISC) సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. అమరావతి ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలను తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే RFP నోటిఫికేషన్ విడుదల చేశామని, అమరావతికి జాతీయ చట్టబద్ధత రావడంతో ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్ తరహా గ్లోబల్ MICE (Meetings, Incentives, Conferences, Exhibitions) హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఇందుకోసం సింగపూర్‌లోని ప్రసిద్ధ Suntec City మోడల్‌ను అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో వాణిజ్య అవకాశాలను విస్తరించేందుకు సింగపూర్ అనుభవాన్ని వినియోగించుకుంటామని లోకేష్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో కూడా సింగపూర్ సహకారం కొనసాగుతుందని తెలిపారు.

గత నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – సింగపూర్ ప్రభుత్వం మధ్య ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్‌షిప్, అమరావతి ఎకనమిక్ రీజియన్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంశాలపై అవగాహన ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఆ ఒప్పంద అమలుపై ప్రస్తుతం ఉన్నతస్థాయి సమీక్షలు కొనసాగుతున్నాయి.