టికెట్లు అమ్మినట్లు నిరూపిస్తే పదవులకు రాజీనామా చేస్తా: మంచూరు సూర్యనారాయణ రెడ్డి

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆరోపణలకు బద్వేల్ టీడీపీ ఇన్‌ఛార్జి కౌంటర్‌.. రాజకీయ కుట్రలతోనే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శ

కడప, నవంబర్ 12: బద్వేల్ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌ టికెట్లు అమ్ముకున్నట్లు, ముడుపులు తీసుకున్నట్లు నిరూపిస్తే డీసీసీబీ పదవితో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవికి రాజీనామా చేస్తానని బద్వేల్ టీడీపీ ఇన్‌ఛార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం బద్వేల్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తాను ఇప్పటికీ, ఎప్పటికీ వీరారెడ్డి అభిమానినేనని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశిస్తే విజయమ్మ, రితేష్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. వెన్నుపోటు రాజకీయాలు చేసేది తాను కాదని, గోవిందరెడ్డేనని విమర్శించారు. శివరామకృష్ణారావు తనను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి పరిచయం చేస్తే, ఆ తర్వాత ఆయనకే వెన్నుపోటు పొడిచి, కుట్రలు, కుతంత్రాలతో 25 ఏళ్లపాటు బద్వేల్ నియోజకవర్గాన్ని ఎలా పాలించారో అందరికీ తెలుసన్నారు.

విద్యావంతుడిగా, ఉన్నత ఉద్యోగం చేసిన వ్యక్తిగా హుందాగా వ్యవహరించాల్సింది పోయి దిగజారి మాట్లాడటం తగదని హితవు పలికారు. రూపాయి ఖర్చు పెట్టకుండా నీచ రాజకీయాలు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గోవిందరెడ్డిపై విమర్శలు చేశారు.

తెలుగుగంగ ఎడమ, కుడి కాలువల పనులకు సంబంధించి షూ కంపెనీ వద్ద గోవిందరెడ్డి డబ్బులు తీసుకోలేదా? అని ప్రశ్నించారు. ఉద్యోగం చేసి వచ్చిన వ్యక్తికి బల్లకింద చేతులు పెట్టే అలవాటు ఉండొచ్చేమో కానీ, తనకు అలాంటి అలవాటు లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. సొంత మండలమైన కాశినాయనలో గోవిందరెడ్డి ఎందుకు పోటీ చేయలేదని, అక్కడ ఎందుకు గెలవలేకపోయారని ప్రశ్నించారు.

నాలుగు జడ్పీటీసీ స్థానాలను గెలుచుకోబోతున్నామని తాను ముందుగానే చెప్పానని గుర్తు చేశారు. తాను టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టి కేవలం నాలుగు నెలలే అయిందని, ఈ సమయంలో సీనియర్ నాయకులకు పదవులు వచ్చేలా కృషి చేశానని తెలిపారు. గోవిందరెడ్డి తన హయాంలో కనీసం ఒక్క సీనియర్ నాయకుడికైనా పదవి ఇచ్చి గౌరవించారా? అని నిలదీశారు.

పదవులు అమ్ముకునే అలవాటు గోవిందరెడ్డికి ఉండొచ్చేమో కానీ, తనకు లేదని మంచూరు సూర్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.