PIBలో CBC విలీనం
ఇకపై ఒకే సంస్థగా కార్యకలాపాలు
రాష్ట్ర, ప్రాంతీయ కార్యాలయాల్లోనూ దశలవారీగా అమలు
విభాగాల వారీగా ఏడీజీలకు బాధ్యతలు.. మీడియా సమన్వయానికి సీఎంసీలు
న్యూఢిల్లీ, నవంబరు 12: కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ)లను విధుల పరంగా విలీనం చేసింది. ఇకపై ఈ రెండు సంస్థలు కలిపి పీఐబీ పేరుతో ఒకే సంస్థగా పనిచేయనున్నాయి. ఈ మేరకు గురువారం కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో సీబీసీ కార్యాలయాన్ని పీఐబీలో విలీనం చేశారు. సమీకృత సంస్థకు పీఐబీ డీజీ (కోఆర్డినేషన్) నేతృత్వం వహిస్తారు. ఆయన ఛైర్మన్/కమ్యూనికేషన్ బోర్డుకు నివేదిస్తారు. ఇప్పటివరకు పీఐబీ, సీబీసీల పరిధిలో పనిచేసిన అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) స్థాయి అధికారులు ఇకపై డీజీ (కోఆర్డినేషన్)కు నివేదించాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని సెంట్రల్ మీడియా కోఆర్డినేటర్లు (సీఎంసీలు) కూడా పీఐబీ పరిధిలోకి వస్తారు.
రాష్ట్రాలు, ప్రాంతీయ కార్యాలయాల స్థాయిలోనూ ఈ ఏకీకరణ ప్రక్రియను దశలవారీగా అమలు చేయనున్నారు. సంబంధిత అధికారుల ఆమోదంతో ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
విభాగాల వారీగా బాధ్యతలు
కొత్త సంస్థాగత నిర్మాణం ప్రకారం.. ప్రిన్సిపల్ డీజీ (పీఐబీ) ఆధ్వర్యంలో డీజీ (కోఆర్డినేషన్) పనిచేస్తారు. ఆయన కింద వివిధ విభాగాలకు ఏడీజీలు బాధ్యతలు నిర్వహిస్తారు.
- నవనీత్ కౌర్: బిల్లింగ్, పరిపాలన విభాగం.
- అజయ్ అగర్వాల్: ఆడియో విజువల్ (ఏవీ), అవుట్‌డోర్ పబ్లిసిటీ, న్యూ మీడియా ప్రచురణ, విడుదల.
- శ్రీ శ్రీ శంభునాథ్ చౌధరి: ఔట్రీచ్ కార్యక్రమాలు, ఐసీఓపీలు, ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలు.
- పద్మ: ముద్రణ ప్రకటనలు, ప్రింటింగ్, బుక్‌లెట్లు, కేటలాగ్‌ల పంపిణీ, మీడియా రేట్లు.
- హిమానీ: రీసెర్చ్ యూనిట్, 'న్యూ ఇండియా సమాచార్', ప్రెస్ టూర్లు, వార్తాలాపాలు (వర్తలాప్).
- వివేక్ వైభవ్: ఫ్యాక్ట్ చెక్ యూనిట్, సోషల్ మీడియా, టీవీ, వార్తాపత్రికలతో సమన్వయం, ప్రెస్ ఫెసిలిటేషన్.