ఏడు జిల్లాల్లో వైసీపీకి సున్నా... మారని జగన్ పార్టీ పరిస్థితి!
అసెంబ్లీ ఎన్నికల నాటి ఫలితాలే పునరావృతం.. 582 జెడ్పీటీసీల్లో 76 స్థానాలకే పరిమితం
జనసేనతో కేవలం మూడు స్థానాల తేడా.. 85.74 శాతం స్థానాలు కూటమి ఖాతాలోకి!
అమరావతి: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం కోలుకోలేదా? రెండున్నరేళ్లు గడిచినా రాజకీయంగా ఆ పార్టీ పరిస్థితిలో మార్పు రాలేదా? తాజాగా వెలువడిన జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఈ ప్రశ్నలను తెరపైకి తెస్తున్నాయి. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాతిపదికన ఎనిమిది జిల్లాల్లో ఖాతా తెరవలేకపోయిన వైసీపీ.. ఇప్పుడు జిల్లాల పునర్విభజన తరువాత ఏర్పడిన 28 జిల్లాల్లో ఏడు జిల్లాల్లో ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు, తాజా పరిషత్ ఎన్నికల ఫలితాలకు మధ్య పెద్దగా మార్పు కనిపించకపోవడం ఆ పార్టీకి ఆందోళన కలిగించే అంశం.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 175 స్థానాలకు పోటీ చేసిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అంటే పోటీ చేసిన స్థానాల్లో 6.29 శాతం మాత్రమే గెలుచుకుంది. అప్పట్లో ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. అధికారం కోల్పోయిన తరువాత పార్టీని బలోపేతం చేసుకోవడం, క్యాడర్లో నూతన ఉత్సాహం నింపడం, ప్రజల్లో తిరిగి విశ్వాసం సంపాదించడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా వెల్లడైన జెడ్పీటీసీ ఫలితాలు చూస్తుంటే ఆ దిశగా ఆశించిన పురోగతి సాధించలేకపోయినట్లు కనిపిస్తోంది.
ఏడు జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ
రాష్ట్రంలో మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి వెల్లడైన ఫలితాల్లో వైసీపీ 76 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఏడు జిల్లాల్లో సున్నా ఫలితాలు రావడం గమనార్హం. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఎనిమిది జిల్లాల్లో ఖాతా తెరవలేని పరిస్థితి ఉండగా, ఇప్పుడు విభజిత జిల్లాల్లోనూ దాదాపు అదే తరహా ఫలితాలు పునరావృతమయ్యాయి. జిల్లాల సంఖ్య పెరిగినా పార్టీకి లభించిన రాజకీయ ఫలితాల్లో మాత్రం గణనీయమైన మార్పు కనిపించలేదనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
జనసేనతో మూడు స్థానాలే తేడా
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. వైసీపీకి, జనసేనకు మధ్య స్థానాల వ్యత్యాసం కేవలం మూడే. మొత్తం 582 జెడ్పీటీసీల్లో వైసీపీ 76 స్థానాలు గెలుచుకోగా, జనసేన 73 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం స్థానాల్లో వైసీపీ వాటా 13.06 శాతం కాగా, జనసేన వాటా 12.54 శాతంగా ఉంది. అంటే రెండు పార్టీల మధ్య వ్యత్యాసం కేవలం 0.52 శాతం పాయింట్లు మాత్రమే. రెండో స్థానంలో ఉన్న వైసీపీకి జనసేన నుంచి గట్టి పోటీ ఎదురైనట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కూటమికి 85 శాతానికి పైగా స్థానాలు
ఇక అధికార కూటమి పార్టీల విషయానికొస్తే తెలుగుదేశం పార్టీ 406 స్థానాలతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జనసేన 73, బీజేపీ 20 స్థానాలను గెలుచుకున్నాయి. మూడు పార్టీలు కలిపి 499 జెడ్పీటీసీలను తమ ఖాతాలో వేసుకున్నాయి. అంటే మొత్తం స్థానాల్లో కూటమి వాటా 85.74 శాతం. టీడీపీ ఒక్కటే 69.76 శాతం స్థానాలను గెలుచుకోవడం విశేషం. వైసీపీకి అత్యధికంగా శ్రీ సత్యసాయి జిల్లాలో తొమ్మిది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏడు, తిరుపతి జిల్లాలో ఆరు స్థానాలు లభించాయి.
మొత్తంగా చూస్తే 2024 అసెంబ్లీ ఎన్నికల తరువాత వైసీపీ తన రాజకీయ ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకోలేకపోయిందనే అభిప్రాయానికి తాజా ఫలితాలు బలం చేకూరుస్తున్నాయి. జనసేనతో స్వల్ప ఆధిక్యంతో రెండో స్థానంలో నిలిచినా.. రాష్ట్రవ్యాప్తంగా సాధించిన 13 శాతం వాటా, ఏడు జిల్లాల్లో ఖాతా తెరవలేకపోవడం ఆ పార్టీ ముందున్న సవాళ్లను తెలియజేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పరాజయం తరువాత కూడా క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని పెంచుకోలేకపోవడం వైసీపీ నాయకత్వానికి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశంగా మారింది.