గన్నవరంలో కూటమికి ఎదురుదెబ్బ...!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

రాష్ట్రవ్యాప్తంగా అటు మున్సిపల్‌, ఇటు పరిషత్‌ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఈ ప్రాంతం.. ఆ ప్రాంతం అని లేకుండా అన్నిచోట్లా కూటమి దూసుకుపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు మించి స్థానిక ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించింది. ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు ఎదురులేకుండా విజయవిహారం చేసింది. చివరకు వైఎస్‌ కుటుంబ కంచుకోట అయిన పులివెందుల్లోనూ విజయఢంకా మోగించింది. అయితే, ఈ విజయాల్లో పంటికింద రాయిలా కొన్ని చోట్ల కూటమి అభిమానులను నివ్వెరపరిచే ఫలితాలు వచ్చాయి. ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, కర్నూలు, నంద్యాల, పార్వతీపురం మన్యం, పోలవరం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో వైకాపా కాస్తోకూస్తో ఉనికి చాటుకుంది. ముఖ్యంగా నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా జెడ్పీని వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 28 జిల్లాల్లో వైకాపాకు దక్కిన జిల్లా అదొక్కటే. కొన్ని వర్గాలు ఇంకా వైకాపా వైపే ఉన్నాయని ఈ జిల్లా ఫలితం స్పష్టం చేస్తోంది.

కాగా, ఒక ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతికి గురిచేసే ఫలితం గన్నవరంలో వచ్చింది. టీడీపీకి గట్టిపట్టు ఉన్న గన్నవరంలో వైకాపా జెడ్పీటీసీ గెలుపొందడంపై రకరకాల రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైకాపా ఘోరంగా పరాజయం పాలైనా, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గన్నవరం జెడ్పీటీసీని వైకాపా గెలుచుకోవడం టీడీపీ నేతలను విస్మయానికి గురిచేసింది. వాస్తవానికి ఇక్కడ కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి ఈ స్థానాన్ని కేటాయించింది. అయితే, బీజేపీ అభ్యర్థిని వైకాపా అభ్యర్థి 63 ఓట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించారు. ఈ ఫలితంపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఒక జెడ్పీటీసీ ఓటమిపై ఇంత చర్చ జరగదు. కానీ, ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులే ఇప్పుడు ఈ చర్చకు కారణం. గన్నవరం నియోజకవర్గంలో భాగమైన గన్నవరం జెడ్పీటీసీలో వైకాపా గెలుపొందడం ఈ నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగమా? అనే చర్చ జరుగుతోంది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వల్లే ఇటువంటి ఫలితం వచ్చిందా? లేక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వ్యక్తమవుతున్న సానుభూతి వల్ల ఈ ఫలితం వచ్చిందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

వాస్తవానికి 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన వల్లభనేని వంశీ వైకాపాలోకి ఫిరాయించారు. జగన్‌ పార్టీలో ఆయన చేరిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అసహ్యకరమైన, అభ్యంతరకరమైన, నీచమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, మంత్రి నారా లోకేశ్‌పైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో విరుచుకుపడేవారు. ఆయనకు తోడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా కలిసి చంద్రబాబు కుటుంబంపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పట్లో వీరిద్దరినీ ఓడించాలని రాష్ట్రంలోని ప్రతి టీడీపీ కార్యకర్త, సానుభూతిపరుడు కోరుకున్నారు. అప్పట్లో రాష్ట్రంలో వచ్చిన కూటమి సునామీలో వీరిద్దరూ గల్లంతయ్యారు.

అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వల్లభనేని వంశీపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. దాదాపు ఆరు నెలలు ఆయన జైలులోనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత ఊరూరా తిరుగుతున్నారు. నియోజకవర్గంలో మళ్లీ పట్టు సాధించడానికి యత్నిస్తున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ప్రతిష్ఠాత్మకమైన గన్నవరం జెడ్పీటీసీలో కూటమి అభ్యర్థి ఓడిపోవడం మారుతున్న రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు ఈ జెడ్పీటీసీ పరిధిలో సుమారు 6 వేల ఓట్లకు పైగా మెజార్టీ వచ్చింది. రెండున్నరేళ్లలోనే కూటమి అభ్యర్థికి ఆ మెజార్టీ పోయి, 63 ఓట్ల తేడాతో ఓటమి ఎదురైందంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బీజేపీ అభ్యర్థి కాబట్టి ఇక్కడ ఓడిపోయాడని సర్దిచెప్పుకోవడం సరికాదేమో! పేరుకు బీజేపీ అయినా, ఇక్కడ గెలుపు బాధ్యత టీడీపీ ఎమ్మెల్యేదే. ఈ ఓటమికి సాకులు చెప్పడం కంటే, నియోజకవర్గంలో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయని గుర్తించాలి. విజయవాడ పట్టణానికి ముఖద్వారమైన గన్నవరంలో టీడీపీలో నెలకొన్న పరిస్థితులపై అధిష్ఠానం ఆరా తీయాల్సిందే.

ఇక్కడ పరిస్థితులన్నింటినీ ఇప్పుడు సరిదిద్దకపోతే, టీడీపీ అధినేత కుటుంబానికి బద్ధశత్రువైన వల్లభనేని వంశీ వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ పాగా వేయడం గ్యారెంటీ అనే భావన సగటు కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.

స్థానిక శాసనసభ్యుడైన యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గంలోని అందరినీ కలుపుకుని వెళ్లడం లేదనే విమర్శ ఉంది. ఉన్న‌త విద్యావంతుడు, నిజాయితీప‌రుడైన యార్ల‌గ‌డ్డ  ఇప్ప‌టికైనా మారుతున్న ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని ఓట‌మికి కార‌ణాల‌ను విశ్లేషించుకోవాలి. రాబోయే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి టిడిపి జెండాను ఎగుర‌వేయాలి.