అమరావతిని మెడికల్ & స్కిల్ హబ్గా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
అమరావతి సమీపంలోని నిడమర్రులో బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. యువతకు భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి, వైద్య రంగంలో ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, చిన్న స్థాయిలో ప్రారంభమైన KIMS Hospitals ఇప్పుడు రూ.30 వేల కోట్ల ఆస్తిగా ఎదిగిందని గుర్తు చేశారు. పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తేనే రాష్ట్రానికి సంపద సృష్టి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి చెందాలంటే పెద్ద సంఖ్యలో పరిశ్రమలు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు రావాల్సిన అవసరం ఉందన్నారు.
హైదరాబాద్ గతంలో కొద్ది ఆస్పత్రులు, హోటళ్లకే పరిమితమై ఉండేదని, ప్రస్తుతం దేశానికే మెడికల్ హబ్గా ఎదగడానికి కిమ్స్ వంటి సంస్థలే కారణమని సీఎం చెప్పారు. అదే తరహాలో అమరావతిని కూడా వైద్య, విద్యా రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
నిడమర్రులో 23 ఎకరాల్లో మెడికల్ కాలేజీ, మరో 2 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. లక్ష మందికి నైపుణ్య శిక్షణ అందించే లక్ష్యంతో ఈ సంస్థలు పనిచేస్తాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లకు భారీ డిమాండ్ ఉందని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వైద్య రంగంపై కూడా పెరుగుతోందని, డాక్టర్లు సైతం ఏఐ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం వ్యాఖ్యానించారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లక్షల ఉద్యోగాలు సృష్టించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
2027 నాటికి ఆసుపత్రి, యూనివర్సిటీ నిర్మాణాలు పూర్తి కావాలని నిర్వాహకులను కోరిన సీఎం, ఇటీవల గూగుల్ ప్రాజెక్టుకు కూడా ఫౌండేషన్ వేశామని గుర్తు చేశారు. 2028 ఆగస్టు నాటికి గూగుల్ కార్యకలాపాలు ప్రారంభం కావాలని సూచించామని తెలిపారు. అలాగే ArcelorMittal ప్లాంట్ ఫేజ్-1 పనులు 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
ప్రభుత్వం తరఫున అనుమతులన్నీ ఆటోపైలట్ మోడ్లో ఇస్తామని, నిర్మాణాలు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించడం పారిశ్రామిక వేత్తల బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు 250 మెడికల్ సీట్లు, 1000 నాన్-మెడికల్ సీట్లు, మరో 1000 మంది ట్రైనీలకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. డెంటల్, ఫిజియోథెరపీ వంటి విభాగాల్లో సుమారు 5000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు.