ఏపీ గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాసంస్థల సంస్థ (APREIS) ఆధ్వర్యంలో నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణమోహన్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన APRS CAT-2026, APRJC CET-2026, APRDC CET-2026 పరీక్షల ఫలితాలను మంగళవారం అధికారికంగా ప్రకటించారు.
7,569 సీట్లకు భారీ పోటీ
ఈ ఏడాది మొత్తం 7,569 సీట్ల కోసం 76,376 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 66,300 మంది పరీక్షలకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 24న రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించబడ్డాయి.
ప్రవేశ పరీక్షల్లో టాపర్ల ప్రతిభ
APRS CAT (5వ తరగతి) ప్రవేశ పరీక్షలో ఆకాశ్ రెడ్డి 97/100 మార్కులతో టాప్లో నిలిచారు. హెచ్. వర్షిత్ 96 మార్కులు, కొర్లపాటి రక్షిత 96 మార్కులు, మోక్షిత్ 90 మార్కులు సాధించారు.
APRJC CET MPC విభాగంలో కొత్తకోట మహాలక్ష్మి 144/150 మార్కులతో ప్రతిభ కనబరిచారు. BiPCలో తోలేటి బెర్నిస్ దియా 145/150 మార్కులతో టాప్ చేశారు.
వివిధ గ్రూపుల్లో విద్యార్థుల సత్తా
ఎంఈసీలో నందమూరి సాయి శశాంక్ 143 మార్కులు, సీఈసీలో నందుపిల్లి లాస్య ప్రియ 141 మార్కులు సాధించారు. ఇఇటీలో చాలమల సాయి సిద్ధార్థ 141 మార్కులు, సీజీటీలో వెల్దుర్తి మోక్షిత్ 139 మార్కులు సాధించారు.
APRDC CETలో బీఏ గ్రూపులో కొర్ర రాజేష్ 101 మార్కులు, బీకామ్లో మండల్ల అర్జునరెడ్డి 127 మార్కులు సాధించారు.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి..?
విద్యార్థులు తమ ఐడీ ద్వారా APREIS Official Website వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితా, కౌన్సెలింగ్ వివరాలను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
IIT, NEET కోచింగ్ సదుపాయం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు IIT/JEE, NEET, CA/CMA, NDA, CDS, RRB వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందించనున్నట్లు కార్యదర్శి ఎ. కృష్ణమోహన్ తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.