ఏపీలో ఎండల భయం.. 47.7°C నమోదు, ప్రజలకు హై అలర్ట్
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకెళ్లాలని తెలిపారు.
మంగళవారం గుంటూరు జిల్లా ములుకుదురులో అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 47.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలోని 125 మండలాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు.
బుధవారం 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే గురువారం 81 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 203 మండలాల్లో సాధారణ వడగాల్పులు నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు.
మే 27న పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
మరోవైపు ఒడిశా నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడవద్దని సూచించారు.
ఎండల తీవ్రత దృష్ట్యా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.