నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. జూన్ 2న గుంటూరులో జాబ్ మేళా
గుంటూరు జిల్లాలో నిరుద్యోగ యువతకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జూన్ 2న గుంటూరులో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గల్లా మాధవి ఆధ్వర్యంలో జరగనున్న ఈ జాబ్ మేళా పోస్టర్ను జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ సి.ఎం. సాయి కాంత్ వర్మ IAS విడుదల చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ జాబ్ మేళాలో సుమారు 30 ప్రముఖ కంపెనీలు పాల్గొంటుండగా, 1100 ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలోని యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు మాట్లాడుతూ ఎస్ఎస్సీ నుంచి బీటెక్, పీజీ వరకు చదివిన అభ్యర్థులు ఈ జాబ్ డ్రైవ్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఇంకుక్స్ ఏఐ ప్రైవేట్ లిమిటెడ్, క్లౌడ్ మెల్లో టెక్నాలజీస్, మాల్టెక్ సొల్యూషన్స్, ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్, ప్రైమారియా హెల్త్ కేర్ వంటి సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. అర్హతలను బట్టి నెలకు ₹9 వేల నుంచి ₹35 వేల వరకు జీతం ఉండవచ్చని పేర్కొన్నారు.
18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు బయోడేటా, విద్యా సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్, పాస్పోర్ట్ ఫోటోలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. జూన్ 2న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గుంటూరులోని హిందూ ఫార్మసీ కళాశాలలో ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. ముందస్తుగా నమోదు కోసం నైపుణ్యం పోర్టల్ ను సందర్శించవచ్చు.