ముగ్గురికీ సర్వీస్ పొడిగింపా?.. ఏపీ సచివాలయంలో జోరుగా చర్చ.. చంద్రబాబు నిర్ణయం ఏంటి?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల భవిష్యత్తుపై సచివాలయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి వాకాటి కరుణ, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మువ్వా కృష్ణబాబు, హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్నారు. అయితే వీరి ముగ్గురి సేవలను మరికొంతకాలం కొనసాగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందనే ప్రచారం ఇప్పుడు మరింత ఊపందుకుంది.
ఈ అంశంపై ఇప్పటికే జనమ్ ఆన్లైన్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో వాకాటి కరుణకు మాత్రమే సర్వీస్ పొడిగింపు లభించే అవకాశాలు ఉన్నాయని, మువ్వా కృష్ణబాబు, అజయ్ జైన్ల విషయంలో స్పష్టత లేదని పేర్కొంది. అయితే తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ముగ్గురు అధికారుల సేవలను కూడా కొనసాగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న కీలక కార్యక్రమాలు, పరిపాలనా ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని అనుభవజ్ఞులైన అధికారుల సేవలను కోల్పోవడం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అందుకే పదవీ విరమణ అనంతరం కూడా వీరి సేవలను వినియోగించుకునే అవకాశాలపై ఉన్నతస్థాయిలో చర్చ జరిగినట్లు సమాచారం.
వాకాటి కరుణ విషయంలో ఆసక్తికర పరిణామం
ముగ్గురిలో వాకాటి కరుణ పేరు ముందుగా వినిపిస్తోంది. గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో ఆమెకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆమె సేవలను కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే, ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ వాకాటి కరుణ మాత్రం సర్వీస్ పొడిగింపుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
వ్యక్తిగత కారణాల వల్లనో, లేక పదవీ విరమణ తర్వాత విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనతోనో ఆమె పొడిగింపును స్వీకరించే విషయంలో ఆసక్తి కనబరచడం లేదని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
అజయ్ జైన్ చుట్టూ రాజకీయ చర్చ
మరోవైపు హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పేరు కూడా ప్రస్తుతం బాగా చర్చనీయాంశమైంది. ఆయన తనకు సర్వీస్ పొడిగింపు లభిస్తుందని, అది కూడా ఆరు నెలలు లేదా ఏడాది కాదు, ఏకంగా మూడేళ్ల వరకు ఉండొచ్చని తన సన్నిహితులతో చెబుతున్నట్లు సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే ఇదే సమయంలో ఆయన సర్వీస్ పొడిగింపును వ్యతిరేకించే వర్గాలు కూడా ఉన్నాయి. గత వైకాపా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహిత అధికారిగా పనిచేశారని, అలాంటి అధికారికి ప్రస్తుత ప్రభుత్వం పొడిగింపు ఎందుకు ఇవ్వాలని కొందరు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే చంద్రబాబునాయుడు నిర్ణయాలు తీసుకునే తీరు గురించి అధికార వర్గాలు మరో కోణాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఆయన రాజకీయ అనుబంధాల కంటే అధికారుల పనితీరు, సామర్థ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే అభిప్రాయం బలంగా ఉంది. అందువల్ల గతంలో ఎవరి ప్రభుత్వంలో పనిచేశారన్నది కంటే, ప్రస్తుతం ప్రభుత్వానికి ఎంత ఉపయోగపడగలరన్న అంశాన్నే ఆయన ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారని చెబుతున్నారు.
బుడితి రాజశేఖర్ ఉదాహరణ గుర్తు చేస్తున్న అధికారులు
ఈ సందర్భంగా గతంలో చోటుచేసుకున్న బుడితి రాజశేఖర్ వ్యవహారాన్ని కూడా అధికారులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఆయనకు సర్వీస్ పొడిగింపు ఇవ్వొద్దంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుచరులు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా వ్యతిరేకించారు. వైకాపాకు సన్నిహితుడిగా ముద్రపడిన అధికారిని కొనసాగించకూడదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ విమర్శలను పట్టించుకోకుండా, ఆయన సామర్థ్యాన్ని గుర్తించి కీలకమైన వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించడమే కాకుండా మూడేళ్లపాటు సర్వీస్ పొడిగించారు. అదే విధానం ఇప్పుడు అజయ్ జైన్ విషయంలోనూ అమలయ్యే అవకాశముందని సచివాలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కృష్ణబాబుపైనా ప్రభుత్వం నమ్మకం
రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మువ్వా కృష్ణబాబు విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగానే ఉందని సమాచారం. కృష్ణబాబు సమర్థుడైన అధికారిగా ప్రభుత్వ పెద్దల వద్ద మంచి గుర్తింపు సంపాదించుకున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో రహదారులు, వంతెనలు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, ఆ శాఖకు అనుభవజ్ఞుడైన అధికారిని కొనసాగించడం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం కీలకమైన రోడ్లు, భవనాల శాఖ బాధ్యతలను అప్పగించింది. రాష్ట్రంలో చేపట్టబోయే మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవ్వాలంటే కృష్ణబాబు వంటి అనుభవజ్ఞుల సేవలు అవసరమని భావిస్తున్నట్లు సమాచారం.
త్వరలోనే స్పష్టత?
ఇదిలా ఉండగా, మరో ఒకటి లేదా రెండు రోజుల్లో రాష్ట్రంలో భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశముందని కూడా సచివాలయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆ బదిలీలతో పాటు పదవీ విరమణ చేయనున్న ఈ ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల సర్వీస్ పొడిగింపుపై కూడా ప్రభుత్వం ఒకేసారి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. అయినప్పటికీ సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, పరిపాలనా అవసరాలు, అధికారుల అనుభవం, కొనసాగుతున్న కీలక ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకుని ఈ ముగ్గురు సీనియర్ అధికారుల సేవలను ప్రభుత్వం మరికొంతకాలం వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం అనంతరమే వెలువడనుంది. దీంతో ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో తెలుసుకోవాలంటే అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు వేచి చూడాల్సిందే.