టెక్స్టైల్, ఆక్వా రంగాల సమస్యలపై కేంద్రంతో ఏపీ నేతల కీలక భేటీ
న్యూఢిల్లీ, మే 20: ఆంధ్రప్రదేశ్కు కీలకమైన టెక్స్టైల్, ఆక్వా, పొగాకు రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వ దృష్టి సారించేందుకు ఎంపీ Lavu Sri Krishna Devarayalu, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి Kinjarapu Ram Mohan Naidu మంగళవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి Piyush Goyalతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా ఉన్న పత్తి, ఆక్వా, పొగాకు రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా దేశీయ మార్కెట్లో నాణ్యమైన పత్తి కొరత, ధరల అస్థిరత వల్ల టెక్స్టైల్ పరిశ్రమలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో పత్తిపై ప్రస్తుతం అమలులో ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని తాత్కాలికంగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దేశీయ మార్కెట్లో పత్తి లభ్యత పెరిగి ధరలు స్థిరపడతాయని వారు అభిప్రాయపడ్డారు. అలాగే 2026 అక్టోబర్ 31 వరకు పత్తి ఎగుమతులపై తాత్కాలిక నియంత్రణలు విధించాలని కోరారు. సీసీఐ (CCI) వద్ద ఉన్న నిల్వలను మధ్యవర్తులకు కాకుండా నేరుగా ఉత్పత్తిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించారు.
ఇక అమెరికా ప్రభుత్వం ఇటీవల విధించిన కొత్త టారిఫ్ల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని నేతలు వివరించారు. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలోని ఆక్వా రైతులు, ఎగుమతిదారులు, హ్యాచరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. లక్షలాది మంది జీవనోపాధి ఈ రంగంపై ఆధారపడి ఉందని పేర్కొంటూ, భారతీయ సీఫుడ్ ఎగుమతులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ మద్దతు అందించాలని కోరారు.
అదేవిధంగా సిగరెట్లపై కొత్త పన్నుల విధానం కారణంగా రాష్ట్రంలోని పొగాకు రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా, కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత ఉండేలా ఆచరణాత్మక విధానాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేశీయ టెక్స్టైల్, సీఫుడ్, పొగాకు ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాష్ట్రంలోని రైతులు, కార్మికులు, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను కాపాడేందుకు కేంద్రం నుంచి సరైన సమయంలో విధానపరమైన మద్దతు అత్యంత అవసరమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఏపీ టెక్స్టైల్ మిల్స్ చైర్మన్ Samineni Koteswara Rao, కమిటీ సభ్యుడు Bandarupalli Ramakrishna తదితరులు పాల్గొన్నారు.