గల్లీ నుంచి ఢిల్లీకి.. ప్రభుత్వ పాఠశాల టెన్త్ టాపర్ల విజయయాత్ర

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

గుంటూరు, మే 20: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా ఉన్నత విజయాలు సాధించగలరని నిరూపించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టెన్త్ టాపర్లకు అరుదైన అవకాశం లభించింది. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు బుధవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే Galla Madhavi ప్రోత్సాహం అందించారు.

ఏ.టి. అగ్రహారం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ C. M. Sai Kanth Varma, ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఢిల్లీలో విద్యార్థులు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులను కలిసే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపోహలకు విద్యార్థులే సమాధానమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా అత్యుత్తమ ర్యాంకులు సాధించవచ్చని ఈ విద్యార్థులు నిరూపించారని ప్రశంసించారు.

విద్యాశాఖ మంత్రి Nara Lokesh ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ తమ్ముళ్లు, చెల్లెళ్లకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. అలాగే పిల్లల విజయాల్లో కీలక పాత్ర పోషించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.

ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వంద రోజుల కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. విద్యార్థుల ఢిల్లీ పర్యటనకు ఎల్‌వీఆర్ అండ్ సన్స్ అధినేత వెంకటేశ్వరరావు, శ్రీ బ్రమర ట్రస్ట్ అధినేత గల్లా రామచంద్రరావు సహకారం అందించారని తెలిపారు.

అలాగే కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి Pemmasani Chandrasekhar విద్యార్థులు ఢిల్లీలో ప్రముఖులను కలిసేలా అన్ని ఏర్పాట్లు చేశారని వెల్లడించారు.

భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ Alapati Rajendra Prasad, గుంటూరు మున్సిపల్ కమిషనర్ K. Mayur Ashok తదితరులు పాల్గొన్నారు.