రేపు 7 జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో 13 జిల్లాల్లో 42°C వరకు ఉష్ణోగ్రతలు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం వాతావరణ పరిస్థితులు విభిన్నంగా ఉండనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని జిల్లాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు.

అలాగే అల్లూరి సీతారామరాజు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు.

వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ సమీపంలో నిలబడవద్దని హెచ్చరించారు.

పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు పేర్కొన్నారు. అలాగే వర్షపు గాలుల కారణంగా విద్యుత్ వైర్లు తెగిపడి ఉండే అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని సూచించారు.

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

అలాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా సోమవారం నెల్లూరు జిల్లా గూడూరులో 41.7 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 41.4 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలో 41.2 డిగ్రీలు, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు అధికారిక హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.