వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ.. ప్రజలకు కీలక సూచనలు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. బుధవారం చిత్తూరు జిల్లా రాయలపేటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 43.7°C ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 22 జిల్లాల పరిధిలోని 143 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

గురువారం రాష్ట్రంలో గరిష్ఠంగా 43-44°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శుక్రవారం ఒక మండలంలో తీవ్ర వడగాలులు, మరో 15 మండలాల్లో సాధారణ వడగాలులు ఉండే అవకాశముందని పేర్కొన్నారు.

మరోవైపు అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో రేపు, ఎల్లుండి అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

బుధవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో నంద్యాల జిల్లా దొర్నిపాడు 42.6°C, కర్నూలు జిల్లా నగరడోన 42.5°C, వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు 42°C నమోదయ్యాయి. అలాగే కంభం, ఉయ్యూరు, తొర్రగుడిపాడు, దేవరపల్లి, బెల్లంకొండ తదితర ప్రాంతాల్లో 41°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో ఎక్కువసేపు తిరగవద్దని అధికారులు సూచించారు. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు.