ఒకవైపు వర్షాలు.. మరోవైపు 44°C ఎండలు.. ఏపీ వాతావరణంపై తాజా హెచ్చరిక

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముండగా, మరికొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, తూర్పు విదర్భ నుంచి దక్షిణ కేరళ వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండలు కూడా తీవ్రంగా ఉండనున్నాయి. పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

సోమవారం నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 43.3 డిగ్రీలు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.1 డిగ్రీలు నమోదయ్యాయి.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ సమీపంలో నిలబడవద్దని అధికారులు సూచించారు. రైతులు, పశుకాపరులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఆకాశంలో ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. అలాగే ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అవసరం లేకపోతే మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.