బాపట్ల కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఒక రోజు మొత్తం బైక్‌పైనే విధులు!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

బాపట్ల: జిల్లా కలెక్టర్ అంటే అధికారిక వాహనాలు, కాన్వాయ్‌లు, భద్రతా సిబ్బంది వెంట ఉండటం సాధారణంగా కనిపించే దృశ్యం. అయితే బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐఏఎస్ సోమవారం అందుకు భిన్నంగా వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక రోజు మొత్తం అధికారిక వాహనాలకు దూరంగా ఉంటూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించి ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు.

తన అధికారిక నివాసం నుంచి బైక్‌పై బయలుదేరిన కలెక్టర్, నేరుగా బాపట్ల మున్సిపాలిటీ 33వ వార్డు చెంగలరాయుల తోట ప్రాంతానికి చేరుకుని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు కూడా పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు.

పింఛన్ల పంపిణీ అనంతరం కలెక్టర్ ద్విచక్ర వాహనంపైనే కలెక్టరేట్‌కు చేరుకుని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారంపై ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జరిగిన అధికారిక సమావేశాలు, సమీక్షా కార్యక్రమాలకు కూడా బైక్‌పైనే హాజరయ్యారు.

ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ప్రయాణం మొత్తం హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తన ఆచరణ ద్వారానే సందేశం అందించారు.

ఒక జిల్లా కలెక్టర్ అధికారిక వాహనాలను పక్కన పెట్టి బైక్‌పై ప్రజల్లోకి రావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికార హోదాకు ఆర్భాటం అవసరం లేదని, ప్రజలకు చేరువగా ఉండటమే నిజమైన ప్రజాసేవ అని కలెక్టర్ వినోద్ కుమార్ తన చర్య ద్వారా చాటిచెప్పారని పలువురు ప్రశంసిస్తున్నారు.