రేపు బయటకు వెళ్లే ముందు ఇది తెలుసుకోండి.. ఏపీ ప్రజలకు కీలక హెచ్చరిక
అమరావతి, జూన్ 9: ఆంధ్రప్రదేశ్లో బుధవారం (జూన్ 10) వాతావరణ పరిస్థితులు విభిన్నంగా ఉండనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
వర్షాల సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఆకస్మికంగా ఈదురుగాలులు, ఉరుములు ప్రారంభమైన వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని తెలిపారు. ముఖ్యంగా చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడకూడదని హెచ్చరించారు. పొలాల్లో పనిచేస్తున్న రైతులు, పశుకాపరులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అలాగే వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉంటుందని, అలాంటి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగనుంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 42.4 డిగ్రీలు, మన్యం జిల్లా భామినిలో 42.2 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 42 డిగ్రీలు నమోదయ్యాయి. పలు ఇతర ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.