బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్.. డీఎస్సీపై వైకాపా ఆరోపణలకు కోన శశిధర్ చెక్!
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కొందరు అభ్యర్థులు గత కొంతకాలంగా చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం నిర్వహించిన తాజా ప్రెస్‌మీట్ గట్టి సమాధానంగా నిలిచింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశాన్ని ప్రభుత్వ వర్గాలు, పార్టీ వర్గాలు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నేతలు కూడా "బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్"గా అభివర్ణిస్తున్నాయి. ఆరోపణలకు కేవలం మాటలతో కాకుండా, అభ్యర్థుల దరఖాస్తులు, మార్కులు, ఎంపిక నిబంధనలను మీడియా ముందుంచి వివరించడం ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా నిలిపింది.
ఇటీవలి కాలంలో ప్రభుత్వం కానీ, పార్టీ కానీ ఈ స్థాయిలో వైకాపా చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టిన సందర్భాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ కార్యదర్శిగా లోకేష్ కోన శశిధర్‌ను నియమించుకున్నారు. విద్యాశాఖ కార్యదర్శిగా ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పలేకపోయినా, సమర్థవంతంగానే వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఆయన పనితీరుపై కొన్ని అభ్యంతరాలు, విమర్శలు ఉన్నప్పటికీ సరైన సమయంలో తన సామర్థ్యాన్ని చాటుకున్నారనే భావన అటు ప్రభుత్వ వర్గాల్లో, ఇటు పార్టీ వర్గాల్లో నెలకొంది.
డీఎస్సీ అక్రమాలంటూ నానా యాగీ చేస్తున్న జగన్ బ్యాచ్‌కు ఆయన తనదైన రీతిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. డీఎస్సీ ఎంత పారదర్శకంగా జరిగిందో ఉదాహరణలతో వివరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతోంది. తొలుత వైకాపా, జగన్ డీఎస్సీ అక్రమాలంటూ చేసిన ప్రచారంతో ప్రభుత్వం, పార్టీ డిఫెన్స్‌లో పడింది. ఎప్పుడైతే కొందరు అభ్యర్థులు జగన్‌ను కలిసి తమకు అన్యాయం జరిగిందని చెప్పారో, అప్పుడే విద్యాశాఖ కార్యదర్శి నేరుగా ప్రెస్‌మీట్ పెట్టి తన వాదనను వినిపించారు.
అప్పటి వరకు జగన్, సాక్షి అండ్ కో చేస్తున్న ప్రచారమే హైలైట్ కాగా, కోన శశిధర్ ప్రెస్‌మీట్ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఈ అంశంలో అప్పటి వరకు ఆత్మరక్షణలో ఉన్న టీడీపీ కూటమి, కోన శశిధర్ నిర్వహించిన మొదటి ప్రెస్‌మీట్, ఆ తర్వాత జరిగిన రెండో ప్రెస్‌మీట్‌తో ఒక్కసారిగా పైచేయి సాధించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైకాపా చేసిన ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం, టీడీపీ వర్గాలు బలమైన సమాధానం ఇచ్చాయని భావిస్తున్నారు.
డీఎస్సీ ఎంపిక జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేసిన అభ్యర్థుల వివరాలను ఒక్కొక్కటిగా పరిశీలించిన అధికారులు, వారికి ఉద్యోగం ఎందుకు రాలేదో, హారిజంటల్ రిజర్వేషన్ విధానం ఏమిటో సవివరంగా వివరించారు. ఈ అంశాలతో సంబంధం లేని వారిని సైతం ఆ వివరణ ఆకట్టుకుంది. అభ్యర్థుల వ్యక్తిగత దరఖాస్తులు, ర్యాంకులు, రోస్టర్ విధానం, అర్హత ప్రమాణాలను ప్రదర్శిస్తూ కేసు వారీగా వివరణ ఇవ్వడం ద్వారా ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టారు.
ముఖ్యంగా కోన శశిధర్ ఇచ్చిన సమగ్ర ప్రజెంటేషన్ సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది. ఆరోపణలు చేసిన ప్రతి అంశాన్ని డేటా, పత్రాధారాలు, నిబంధనలతో వివరించడం ద్వారా ఆయన విశేష ప్రశంసలు అందుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికల్లో "ఫ్యాక్ట్స్ వర్సెస్ ఆరోపణలు" అనే చర్చకు ఈ ప్రెస్‌మీట్ కేంద్రబిందువుగా మారింది.
ప్రభుత్వ వర్గాల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రెస్‌మీట్‌తో డీఎస్సీపై వైకాపా చేస్తున్న ఆరోపణలకు గట్టి చెక్ పడింది. కేవలం రాజకీయ ఆరోపణలు కాకుండా వాస్తవ ఆధారాలను ప్రజల ముందుంచడంతో నియామక ప్రక్రియపై ఉన్న అనేక సందేహాలు తొలగిపోయాయని అంటున్నారు. గత డీఎస్సీ ద్వారా ఎంపికైన 15,941 మంది అభ్యర్థుల నియామకాలు పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగాయని అధికారులు స్పష్టం చేశారు.
అభ్యర్థుల పేర్లు, దరఖాస్తులు, మార్కులు, రిజర్వేషన్ విధానం వంటి అంశాలను బహిరంగంగా చూపిస్తూ నిర్వహించిన ఈ సమావేశం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆరోపణలు చేసిన వారిలో కొందరు వాస్తవ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోకుండా రాజకీయ ప్రచారానికి బలయ్యారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
డీఎస్సీ వివాదంపై సాగుతున్న చర్చల మధ్య కోన శశిధర్ ఇచ్చిన వివరణ ప్రస్తుతం రాజకీయ, విద్యా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆరోపణలపై ఆధారాలతో స్పందించిన ఈ ప్రెస్‌మీట్‌ను చాలా మంది "వైకాపా ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టిన సమావేశం"గా అభివర్ణిస్తున్నారు.
కోన శశిధర్ సామర్థ్యాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు గతంలోనే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కోన శశిధర్‌ను అనంతపురం జిల్లా కలెక్టర్‌గా నియమించారు. అప్పట్లో కియా కార్ల పరిశ్రమ స్థాపన సందర్భంగా కోన శశిధర్ పనిచేసిన విధానాన్ని మెచ్చుకున్న చంద్రబాబు, అనంతరం ఆయనను అత్యంత కీలకమైన గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమించారు.
పనిచేసే అధికారిగా కోన శశిధర్‌కు ఉన్న పేరుతోనే ఇప్పుడు కూడా కీలకమైన విద్యాశాఖ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఈ రెండేళ్లలో రికార్డు స్థాయిలో డీఎస్సీ పూర్తి చేయడంలోనూ, తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేయడంలోనూ, విద్యా వ్యవస్థలో కీలకమైన మార్పులు తీసుకురావడంలోనూ శశిధర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
మొత్తం మీద కీలకమైన సమయంలో బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించి అటు అధికార పెద్దలతోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ కోన శశిధర్ ప్రశంసలు అందుకుంటున్నారు. డీఎస్సీ వివాదంపై ఆయన ఇచ్చిన సమగ్ర వివరణ ప్రస్తుతం ప్రభుత్వానికి, కూటమికి రాజకీయంగా బలాన్ని చేకూర్చిన అంశంగా చర్చనీయాంశమవుతోంది.