చంద్రబాబు జాతకాలను నమ్ముతున్నారా? మంత్రివర్గ విస్తరణ ఆలస్యంపై ఆసక్తికర ప్రచారం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందనే అంశంపై గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతకాలు, ముహూర్తాలను పరిశీలించిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే, ఈ ప్రచారానికి అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు.
గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లకు పైగా గడిచినా ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. దీంతో కొత్తగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేల్లో ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో కొందరు ప్రస్తుత మంత్రుల పనితీరుపై పార్టీ అంతర్గతంగా అసంతృప్తి ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.
కొంతమంది మంత్రులు ప్రజల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారని, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొందరిపై అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా తొలిసారి మంత్రులు అయిన వారు, వైకాపా నుంచి టిడిపిలో చేరి మంత్రులు అయిన వారిపై, వారి కార్యాలయాలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ వారిని హెచ్చరించినా..వారి తీరులో మార్పులేదని, పదవి ఉన్నాన్నాళ్లు దోచుకుందామనే ఆరాటం తప్ప మరో ఆలోచన చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు కొందరు మంత్రులు సమర్థంగా స్పందించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ముఖ్యంగా వైసీపీ చేస్తున్న ఆరోపణలను బలంగా తిప్పికొట్టడంలో కొందరు మంత్రులు చురుకుగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తోన్న విమర్శలు, ఆరోపణలపై మంత్రులు స్పందించడం లేదు. ఆయనపై దాడి చేయడానికి వీరు జంకుతున్నారు. ఒకవేళ రేపు జగన్ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటనే భావనతోనే వీరు ఇలా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. డిఎస్సీ ఉదంతంలో జగన్ చేసిన ఆరోపణలను ప్రభుత్వ అధికారులే బలంగా తిప్పికొట్టారు కానీ..మంత్రులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. డీఎస్సీ ఆరోపణల్లో మంత్రులు ఉదాసీనంగా ఉన్నా..అధికారులు మాత్రం ప్రతి విమర్శకూ సావధానంగా, ప్రజలు అర్థం చేసుకునే రీతిలో సమాధానం చెప్పి ప్రజలను, పార్టీని మెప్పించారు. మంత్రుల్లో మెజార్టీ మంత్రులు ఈ విషయంలో చోద్యం చూశారు.
ఈ పరిస్థితుల్లో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే విస్తరణ ఆలస్యం వెనుక ముహూర్తాలు, జ్యోతిష్య సలహాలే కారణమన్న వార్తలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనా నిర్ణయాల్లో జ్యోతిష్యాన్ని పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే అభిప్రాయం ఉండేది. ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిపై విశ్వాసం ఉన్నప్పటికీ, జాతకాలు లేదా ముహూర్తాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారనే ప్రచారం పెద్దగా ఉండేది కాదు. అయితే ఇటీవల కొన్ని యాగాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం, అమరావతిలో నిర్మిస్తున్న నివాస గృహానికి ప్రత్యేక ముహూర్తం నిర్ణయించారనే వార్తలు రావడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది.
రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, కొందరు జ్యోతిష్య నిపుణుల సలహాలు తీసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. అదే కారణంగా మంత్రివర్గ విస్తరణతో పాటు కీలక పరిపాలనా నిర్ణయాలకు కూడా శుభముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారనే కథనాలు వెలువడుతున్నాయి.అయితే ఇదంతా నిజం కాదని, కేంద్ర మంత్రివర్గ విస్తరణ తరువాత రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారని, ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి మరో రెండు పదవులు దక్కుతాయని, దాని తరువాత వివిధ సమీకరణలు చూసుకుని మంత్రివర్గ విస్తరణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తలపోస్తున్నారంటున్నారు. అదీ కాక..మంత్రివర్గవిస్తరణ చేస్తే..అదో కీచులాట అవుతుందని, పార్టీలో ఇబ్బందులు వస్తాయని, ఇదే టీమ్తో మరికొన్నాళ్లు సాగదీస్తే..మేలనే భావన కూడా ఆయనలో ఉందంటున్నారు.
ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందన్న దానిపై అధికారిక స్పష్టత లేకపోయినా, జాతకాలు–ముహూర్తాల అంశం రాజకీయ చర్చకు దారితీస్తోంది. ప్రచారంలో ఉన్న ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.