నేలపై కూర్చుని మత్య్సకార కుటుంబంతో భోజనం చేసిన సీఎం చంద్రబాబు
కావలి, మే 19:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu మంగళవారం నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో ఓ మత్య్సకార కుటుంబంతో కలిసి భోజనం చేసి ఆత్మీయత చాటుకున్నారు. ‘మత్య్సకారుల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక చేపల మార్కెట్ను సందర్శించిన సీఎం స్వయంగా చేపలు కొనుగోలు చేసి, మత్స్యకారుడు తానంగారి బాబు ఇంటికి వెళ్లి వండించుకుని భోజనం చేశారు.
మార్కెట్లో మహిళా వ్యాపారులతో మాట్లాడిన చంద్రబాబు స్థానిక చేపల రకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మత్స్యకారుడు తానంగారి బాబు, ఆయన కుమారుడు గిరి ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లారు. సీఎం తీసుకెళ్లిన చేపలతో తానంగారి బాబు సతీమణి వెంకమ్మ చేపల పులుసు వండగా, చంద్రబాబు అక్కడే ఉండి వంట విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. సరదాగా గరిటె కూడా తిప్పారు.
ఇటీవల ప్రసవించిన వెంకమ్మ కుమార్తెను పలకరించి తల్లీబిడ్డ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేసిన సీఎం, స్వయంగా చేపల పులుసు వడ్డించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ‘మత్య్సకారుల సేవలో’ పథకం ద్వారా ఏడాదికి అందుతున్న రూ.20 వేల ఆర్థిక సాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతోందని తానంగారి బాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తమ ఇంటికి ముఖ్యమంత్రి రావడం జీవితాంతం మరిచిపోలేని సంఘటన అని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.