ఏపీలో విభిన్న వాతావరణం.. పిడుగులతో వర్షాలు, మరోవైపు వడగాలులు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో వడగాలులు, ఎండ తీవ్రత కొనసాగనున్నట్లు వెల్లడించారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ఇది రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు. అల్పపీడనం నుంచి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు.

పలు జిల్లాల్లో వర్ష సూచన

ఈ ప్రభావంతో బుధవారం అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

రైతులు, పశుకాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు.

కొన్ని ప్రాంతాల్లో వడగాలులు

అల్లూరి జిల్లా జికే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు ప్రాంతాలతో పాటు పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా నగరడోనలో 42.9°C, నంద్యాల జిల్లా కొత్తపల్లెలో 42.4°C, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 42°C నమోదయ్యాయి.

అలాగే ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 41.9°C, పల్నాడు జిల్లా గురజాలలో 41.3°C, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 41.1°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఎండ తీవ్రత, వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.