పీఆర్సీ చైర్మన్‌గా దినేశ్‌కుమార్
12వ వేతన సవరణ కమిషన్‌కు రిటైర్డ్ ఐఏఎస్ నియామకం
ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం.. ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణపై కసరత్తు
దినేష్‌కుమార్ వర్సెస్ అజయ్‌కల్లం...!
అమరావతి, అక్టోబరు 1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)కు చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ గురువారం జీవో ఎంఎస్ నంబర్ 200ను జారీ చేసింది. 1983 బ్యాచ్‌కు చెందిన దినేశ్‌కుమార్‌ను పీఆర్సీ కమిషనర్‌గా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఖాళీగా ఉన్న పీఆర్సీ కమిషనర్ పదవి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 12వ పీఆర్సీని 2023లో ఏర్పాటు చేసి, అప్పట్లో డాక్టర్ మన్మోహన్సింగ్ (రిటైర్డ్ ఐఏఎస్)ను కమిషనర్‌గా నియమించారు. అయితే ఆయన రాజీనామాను ప్రభుత్వం 2024 జూన్‌లో ఆమోదించడంతో కమిషనర్ పదవి ఖాళీగా ఉంది. తాజాగా ప్రభుత్వం దినేశ్‌కుమార్‌ను నియమించడంతో పీఆర్సీ ప్రక్రియ మళ్లీ ముందుకు కదలనుంది.
దినేష్‌కుమార్ వర్సెస్ అజయ్‌కల్లం...!
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దినేష్‌కుమార్ అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. 2014-19 మధ్య చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దినేష్‌కుమార్‌ను ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా నియమించుకున్నారు. దినేష్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో చంద్రబాబుకు అప్పట్లో అజయ్కల్లంరెడ్డితో విరోధం ఏర్పడింది. అప్పట్లో అజయ్‌కల్లం రెడ్డికి సిఎస్ పదవి ఇస్తానని చంద్రబాబు మాట ఇచ్చారట. ఇచ్చిన మాట ప్రకారం ఆయనను సిఎస్‌గా నెల రోజుల పాటు నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే అదే జీవోలో దినేష్‌కుమార్ తరువాత సిఎస్ అవుతారని కూడా పేర్కొన్నారు. దీంతో అజయ్ కల్లంకు ఎక్కడ లేని కోపం వచ్చిందట. తనకు సిఎస్ పదవి ఇస్తానని చంద్రబాబే చెప్పారు..పైగా పొడిగింపు కూడా ఇస్తానని చెప్పి..ఇప్పుడు దినేష్‌కుమార్ తరువాత సిఎస్ అంటూ జీవో ఇస్తారా..అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి..చంద్రబాబును ఓడిస్తానని శపథం చేశారట. తనను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని భావించిన ఆయన వెంటనే వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వద్దకు వెళ్లి చంద్రబాబు ఓటమికి కృషి చేశారు. అప్పట్లో అజయ్‌కల్లం రెడ్డా...దినేష్కుమారా...? అనే ఎంపికలో చంద్రబాబు దినేష్కుమార్వైపే మొగ్గుచూపారు. అప్పుడే కాదు..దినేష్‌కుమార్ రిటైర్ అయిన తరువాత కూడా చంద్రబాబు ఆయనకు పదవులు ఇస్తూనే ఉన్నారు. తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏకసభ్య కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన పిఆర్సీ ఛైర్మన్‌గా చంద్రబాబు దినేష్‌ను నియమించారు.
ఉద్యోగ సంఘాల డిమాండ్‌కు కార్యరూపం
12వ పీఆర్సీ చైర్మన్ నియామకం చేయాలని ఉద్యోగ సంఘాలు కొంతకాలంగా కోరుతున్నాయి. సెప్టెంబరు 5న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రభుత్వం పీఆర్సీ కమిషనర్‌ను నియమిస్తామని హామీ ఇచ్చింది. అనంతరం నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి.
నివేదికకు ఏడాది గడువు
పీఆర్సీకి ఇప్పటికే జారీ చేసిన విధివిధానాల (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) ప్రకారమే కమిషన్ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి ప్రతినిధులను స్వీకరించడం, అవసరమైన సమాచారాన్ని సేకరించడం, సంబంధిత శాఖల నుంచి వివరాలు తీసుకోవడం వంటి అంశాలపై కమిషన్ స్వయంగా విధానాన్ని రూపొందించుకోనుంది.
దినేశ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఏడాదిలోగా ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. కమిషన్ ప్రధానంగా వెలగపూడి నుంచి పనిచేయనుంది. అవసరాన్ని బట్టి రాష్ట్రంలో లేదా రాష్ట్రం వెలుపల పర్యటించేందుకు కూడా అవకాశం కల్పించారు.
ఉద్యోగులు, పెన్షనర్లలో ఆసక్తి
పీఆర్సీ నియామకంతో వేతన సవరణతో పాటు ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పలు అంశాలపై తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యంగా వేతన సవరణ, భత్యాలు, ఇతర సేవా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పీఆర్సీ నివేదిక కీలకం కానుంది. అయితే కొత్త వేతనాలు లేదా ఫిట్‌మెంట్‌పై ఈ జీవో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చైర్మన్ నియామకం, కమిషన్ పని విధానం, నివేదిక సమర్పణ గడువును మాత్రమే ఉత్తర్వులు నిర్దేశించాయి.