యూట్యూబ్‌లో ప్లాన్.. మద్యంలో గుళికలు.. ఇద్దరు మహిళల దారుణ హత్య కేసు ఛేదించిన ఏలూరు పోలీసులు
ఏలూరు: జిల్లాలో సంచలనం సృష్టించిన ఇద్దరు మహిళల హత్య కేసును ఏలూరు పోలీసులు ఛేదించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజ్‌లు, కాల్ డేటా రికార్డుల (సీడీఆర్) ఆధారంగా దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిశోర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ట్రైనీ ఐపీఎస్ జయా శర్మ సూచనల మేరకు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. నల్లజర్ల-తాడేపల్లిగూడెం జాతీయ రహదారిపై నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన నిందితులు పోనమాల శిరీష, కర్రి ప్రసాదు అలియాస్ బన్ను, ఆశు దుర్గగా పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి హత్య సమయంలో దోచుకున్న బంగారు, వెండి ఆభరణాలు, సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన రాయి, బీరు సీసాలు, మత్తు గుళికలు, పల్సర్ మోటార్ సైకిల్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు సంచలనం కలిగిస్తున్నాయి. ప్రధాన నిందితురాలు శిరీష తన భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటూ కర్రి ప్రసాదుతో సహజీవనం చేస్తోంది. మృతురాలు మద్ద వెంకటలక్ష్మి ఆమెకు వదిన కాగా, గంటా ఆంతోబాయి వరుసకు అత్త అవుతుంది.
శిరీషకు ఇతరులతో సంబంధాలు ఉన్నాయని మృతురాళ్లు ఆమె భర్తకు చెప్పినట్లు తెలిసి, వారిపై తీవ్ర కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా గంటా ఆంతోబాయి వద్ద నుంచి తీసుకున్న రూ. లక్ష అప్పును తిరిగి చెల్లించకుండా ఉండాలనే ఉద్దేశం కూడా హత్యకు కారణమైందని విచారణలో తేలింది.
పోలీసుల కథనం ప్రకారం, శిరీష ముందుగానే హత్యకు ప్రణాళిక రూపొందించింది. యూట్యూబ్‌లో పద్ధతులు పరిశీలించి, తన సహచరులతో కలిసి కుట్ర పన్నింది. మే 29న ఇద్దరు మహిళలను మద్యం తాగుదామని చెప్పి దూబచర్ల సమీపంలోని జీడిమామిడి తోటకు తీసుకెళ్లింది. అక్కడ మద్యంలో మత్తు గుళికలు కలిపి తాగించింది.
మహిళలు స్పృహ కోల్పోయిన అనంతరం బ్లేడ్‌తో దాడి చేసి, రాయితో తలలపై విచక్షణారహితంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నేరానికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా నిందితులు సంఘటనా స్థలాన్ని తారుమారు చేసి పరారయ్యారు.
అయితే సీసీటీవీ ఫుటేజ్‌లు, కాల్ డేటా విశ్లేషణ, సాంకేతిక ఆధారాలతో పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.