ఏలూరులో టీడీపీ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన.. భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ఏలూరులో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి సోమవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే మరియు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తే పార్టీకి అసలైన బలం: మంత్రి పార్థసారథి

ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ సాధారణ కార్యకర్తే పార్టీకి అసలైన అధినేత అనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందన్నారు. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్మాణాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు సాంకేతికత, ఆధునిక వ్యూహాలు కీలకమని పేర్కొన్నారు. అందుకే శాశ్వత జిల్లా కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.

అట్టహాసంగా భూమిపూజ కార్యక్రమం

నిర్ణయించిన ముహూర్తంలో భూమిపూజ కార్యక్రమాన్ని నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బడేటి చంటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులకు కండువాలు కప్పి ఘన స్వాగతం పలికారు.

చాలా రోజుల తర్వాత జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు తమ్ముళ్లు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం మొత్తం పార్టీ ఐక్యతకు నిదర్శనంగా కనిపించింది.

బడేటి చంటి నాయకత్వంపై ప్రశంసలు

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బడేటి చంటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. అందరినీ కలుపుకుపోతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారని నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ, మాజీ ఎమ్మెల్సీ కమ్మెల విఠల్, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్‌ఛార్జీలు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.