ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకొస్తున్నాం: సీఎం చంద్రబాబు
అమరావతి, మే 12: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్ మరియు వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధి కోసం ప్రభుత్వం “ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు” తీసుకొస్తోందని వెల్లడించారు. అన్న క్యాంటీన్లలో నాణ్యమైన భోజనం అందేలా నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా చూడాలని ఆదేశించారు.
మహిళలపై నేరాల విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.
రాష్ట్రంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, జలధార-జలహారతి పనులను వేగవంతం చేసి మ్యాపింగ్ చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
రోడ్లపై గుంతల సమస్యపై ప్రత్యేకంగా స్పందించిన సీఎం.. క్షేత్రస్థాయి సమాచారం ఎప్పటికప్పుడు సేకరించాలని చెప్పారు. కొన్ని జిల్లాల్లో బస్సులకు సీసీ కెమెరాల ద్వారా రోడ్ల పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అదే తరహాలో టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచాలని సూచించారు.
డేటా ఆధారిత నిర్ణయాలు, అడ్వాన్స్డ్ ప్లానింగ్తో పరిపాలనను మరింత బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.