పల్నాడు జిల్లాలో ఉచిత హాస్టల్ ప్రవేశాలు.. విద్యార్థులకు గుడ్న్యూస్
పల్నాడు జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ఆమె అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భద్రత, ఆరోగ్య సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
జిల్లాలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులతో పాటు ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే ఉద్దేశంతో ప్రత్యేక ట్యూటర్లను నియమించామని చెప్పారు. అనుభవజ్ఞులైన వసతి గృహ సంక్షేమ అధికారుల పర్యవేక్షణలో స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం విద్యలో డిజిటల్ సదుపాయాల ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆన్లైన్ తరగతులు నిర్వహించడంతో పాటు పాఠశాలల్లో ఇచ్చే ప్రాజెక్టు వర్కులను కూడా విద్యార్థుల చేత చేయించేలా మార్గదర్శకత్వం అందించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.
విద్యార్థినుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఇంచార్జి కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. వసతి గృహాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం వేడి వేడి భోజన సదుపాయాలు అందించనున్నట్లు వెల్లడించారు.
ప్రతి విద్యార్థికి నాణ్యమైన బెడ్ షీట్స్, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు వంటి అవసరమైన సామగ్రిని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి నెలా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు కూడా అందించనున్నట్లు చెప్పారు. విద్యార్థుల విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయడానికి ప్రతి నెలా ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
ఈ వసతి గృహాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు ఫారాలను గ్రామ సచివాలయాల్లోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వసతి గృహ సంక్షేమ అధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల కార్యాలయాల ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమం మరియు సాధికారత అధికారి సంతోష్ కుమార్తో పాటు పల్నాడు జిల్లా వసతి గృహ సంక్షేమ అధికారులు జయప్రద, రాణమ్మ, రాజేశ్వరి, రామాంజనేయులు, వెంకటేశ్వర నాయక్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.