ఖరీఫ్ రైతులకు శుభవార్త.. పంటల MSP భారీ పెంపు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

అమరావతి, మే 13: దేశ రైతాంగ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు (MSP) రైతులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయమని ఆయన అభినందించారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా రైతుల్లో కొత్త నమ్మకాన్ని పెంచుతున్నాయని మంత్రి తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ పంటల MSP పెంపు కోసం రూ.2 లక్షల 60 వేల కోట్ల భారీ వ్యయాన్ని ఆమోదించిందని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇది రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. పెట్టుబడి ఖర్చుకు కనీసం 50 శాతం లాభం జోడించి MSPలను నిర్ణయించడం రైతులకు నిజమైన భరోసా కల్పించే చర్యగా పేర్కొన్నారు.

రైతు కష్టానికి తగిన గిట్టుబాటు ధర అందించాలన్న సంకల్పంతోనే పలు పంటల MSPలను గణనీయంగా పెంచినట్లు మంత్రి తెలిపారు. వరి కామన్ రకానికి క్వింటాల్‌కు రూ.72 పెంచి రూ.2441గా నిర్ణయించగా, గ్రేడ్-ఏ వరికి రూ.2461గా నిర్ణయించడం రైతులకు లాభదాయకమన్నారు. అదేవిధంగా జొన్నకు రూ.4073, రాగికి రూ.5205, సజ్జలకు రూ.2900, ఉలవలకు రూ.8200, మొక్కజొన్నకు రూ.2410 MSP ప్రకటించడం రైతులకు ప్రోత్సాహకరమన్నారు.

నువ్వులకు రూ.10,346, సన్‌ఫ్లవర్‌కు రూ.8343, పత్తికి రూ.8667, వేరుశనగకు రూ.7517 వరకు MSP పెంపు చేయడం వ్యవసాయ రంగానికి ఊతమివ్వనుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రైతులకు దీర్ఘకాలిక లాభాలను అందిస్తాయని చెప్పారు.

ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎరువులు, విత్తనాలు, కార్మిక వ్యయాల పెరుగుదలతో సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ నేపథ్యంలో MSP పెంపు రైతుల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుందని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. రైతు సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది అన్న దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొనియాడారు.

రాష్ట్రంలోని రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన MSPలను పూర్తిస్థాయిలో పొందేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలు, మార్కెటింగ్ వ్యవస్థ, మద్దతు ధర అమలు ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు తమ పంటలను సరైన ధరకు విక్రయించుకునేలా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.

వ్యవసాయ రంగాభివృద్ధి, రైతుల ఆదాయ వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలకు రాష్ట్ర రైతుల తరఫున మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. MSP పెంపుతో రైతుల్లో నూతన ఆశలు చిగురించాయని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుందని ఆయన పేర్కొన్నారు.