రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు.. 204 మండలాల్లో 43°C పైగా ఉష్ణోగ్రతలు
అమరావతి, మే 20: ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని Andhra Pradesh State Disaster Management Authority హెచ్చరించింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ Prakhar Jain వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ వేసవిలోనే అత్యధికంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 23 మండలాలు, కృష్ణాలో 21, ప్రకాశంలో 20, ఏలూరులో 20 మండలాల్లో తీవ్ర ఎండలు ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.
రానున్న నాలుగు రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మే 21, 22 తేదీల్లో పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మే 23న కూడా పలు జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
ఇక వడగాల్పుల ప్రభావం కూడా తీవ్రంగా ఉండనున్నట్లు ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. రేపు రాష్ట్రంలోని 74 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 232 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి 24 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 270 మండలాల్లో వడగాల్పుల ప్రభావం కనిపించే అవకాశం ఉందన్నారు.
బుధవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు అగ్రస్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా కంకిపాడులో, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 46.1 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 46 డిగ్రీలు నమోదయ్యాయి. బాపట్ల జిల్లా కొల్లూరు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 45.9 డిగ్రీలు నమోదయ్యాయి.
ఎండ తీవ్రత దృష్ట్యా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. గుండె సంబంధిత వ్యాధులు, బీపీ, షుగర్ ఉన్నవారు అత్యవసర పరిస్థితులు తప్ప ఎండలో బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, సాధారణ మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే మండలాల పూర్తి వివరాలను ఏపీఎస్డీఎంఏ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.