జగన్.. పవన్ బుట్టలో పడతారా..!?
వైకాపా ప్రయోగించిన కుల, మత రాజకీయ అస్త్రమే ఇప్పుడు జగన్‌కు రాజకీయ పరీక్షగా మారుతోందా..? ప్రశ్న రావణ్ వ్యవహారంలో జగన్ స్పందించినా ఇబ్బందే.. మౌనంగా ఉన్నా నష్టమేనా..? అధికార కూటమి వ్యూహం వెనుక అసలు లక్ష్యం ఏమిటి..?
రాజకీయాల్లో ప్రత్యర్థిని నేరుగా ఎదుర్కొని ఓడించడం ఒక పద్ధతి. ప్రత్యర్థి బలహీనతలను గుర్తించి, అతడే స్వయంగా రాజకీయంగా ఇబ్బందికరమైన నిర్ణయం తీసుకునే పరిస్థితిని సృష్టించడం మరో పద్ధతి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే, అధికార కూటమి రెండో తరహా రాజకీయ వ్యూహాన్నే అమలు చేస్తోందా..? అనే సందేహం కలుగుతోంది. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌పై వరుసగా కేసులు నమోదు కావడం, ఒక కేసులో న్యాయస్థానం నుంచి ఉపశమనం లభించగానే మరో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం, చివరకు UAPA సెక్షన్ల కింద కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా నేరుగా రంగంలోకి దిగకపోవడం, ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రత్యక్షంగా స్పందించకపోవడం,ఆ పార్టీకి చెందిన సోషల్‌మీడియా స్పందించకపోవడం, కొంత మంది సోషల్ మీడియా రావణ్‌కు మద్దతు ఇస్తే..నష్టపోతామనే భయాన్ని వ్యక్తం చేయడం రాజకీయంగా మరింత ఆసక్తిని రేపుతోంది. జగన్‌కు ముందున్న రాజకీయ ప్రమాదం అర్థమైందా..? ఆయన మాట్లాడితే అధికార కూటమి ఎలాంటి ప్రచారానికి తెరతీస్తుందో ముందుగానే పసిగట్టారా..? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అసలు చర్చ ఇదే.
నాడు పవన్.. నేడు జగన్..?
గత కొంతకాలంగా రాష్ట్రంలో జరిగే పలు సంఘటనలను కులం, మతం కోణంలో వైకాపా రాజకీయంగా ప్రశ్నిస్తోందనే విమర్శలు అధికార కూటమి నుంచి వినిపిస్తున్నాయి. బాధితుడు ఏ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి..? ఆ ఘటన వల్ల ఏ కులానికి అన్యాయం జరిగింది..? అనే అంశాలను ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందనేది కూటమి నేతల ఆరోపణ. ఈ తరహా రాజకీయ దాడిని ఎక్కువగా ఎదుర్కొన్న నేతల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒకరు. కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి సంబంధించిన ఏదైనా వివాదాస్పద ఘటన చోటుచేసుకుంటే.. “పవన్ ఎక్కడ..?” అనే ప్రశ్నను వైకాపా ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్‌ను ఆయన సొంత సామాజికవర్గం ముందు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందని జనసేన నేతలు పలుమార్లు ఆరోపించారు.
విజయవాడలో జరిగినట్లు చెబుతున్న లాకప్ డెత్ వ్యవహారంలోనూ ఇదే తరహా రాజకీయ విమర్శలు వచ్చాయి. మరణించిన వ్యక్తి రౌడీషీటర్ అన్న అంశం కంటే.. అతను కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అన్న అంశమే రాజకీయంగా ముందుకొచ్చింది. “కాపు వ్యక్తి చనిపోతే పవన్ ఎందుకు స్పందించడం లేదు..?” అనే ప్రశ్నలు వినిపించాయి. దీంతో పవన్ స్వయంగా స్పందిస్తూ.. “నేను కుల నాయకుడిని కాదు. రౌడీలకు కులం ఉండదు” అని స్పష్టం చేశారు. అయితే ఆ వివరణతో వివాదం ముగియలేదు. అదే వ్యాఖ్యను వైకాపా నేతలు మరో రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు. అంటే పవన్ మాట్లాడినా రాజకీయ ఇబ్బందే.. మౌనంగా ఉన్నా ఇబ్బందే. బహుశా ఇక్కడే అధికార కూటమికి వైకాపా రాజకీయ వ్యూహంలోని బలహీనత అర్థమైందా..? ఇప్పుడు అదే తరహా పరిస్థితిని జగన్ ముందు సృష్టిస్తున్నారా..? అనే అనుమానం వ్యక్తమవుతోంది.
ఏలూరు సభతో మారిన రాజకీయ సమీకరణం
ఈ నేపథ్యంలో ఏలూరులో జరిగిన ‘దళిత క్రైస్తవ సమర శంఖారావం’ సభ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్‌కుమార్, యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఈ సభలో పాల్గొన్నారు. దళిత క్రైస్తవుల సమస్యలను ప్రస్తావించేందుకు సభ నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే సభలో చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని వ్యాఖ్యలే మొత్తం వ్యవహారాన్ని మరో దిశకు తీసుకెళ్లాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆధ్యాత్మిక వక్త రాధా మనోహర్ దాస్లపై అభ్యంతరకరమైన, వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.
ముఖ్యంగా జడ శ్రావణ్‌కుమార్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. “దళిత క్రైస్తవుల గురించి మరోసారి మాట్లాడితే నాలుక కోసి పవన్ కల్యాణ్‌కు పంపిస్తా”, “సమాధి కడతా” అంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రశ్న రావణ్ కూడా పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇక్కడే రాజకీయ వాతావరణం మారింది. అప్పటివరకు విమర్శలను రాజకీయంగానే ఎదుర్కొంటున్న అధికార కూటమి.. ఏలూరు సభ తర్వాత కఠిన వైఖరి అవలంబించినట్లు కనిపిస్తోంది.
కేసు మీద కేసు.. వైకాపా మాత్రం మౌనం
ఏలూరు సభ తర్వాత ప్రశ్న రావణ్‌పై కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుంటే న్యాయస్థానం రిమాండ్ విధించలేదు. ఆ తర్వాత మరో కేసు తెరపైకి వచ్చింది. అందులోనూ న్యాయపరమైన ఉపశమనం లభించింది. ఆ వెంటనే మరో పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా వరుసగా కేసులు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. “ఒక యూట్యూబర్‌పై ఇన్ని కేసులా..?” అనే ప్రశ్న సామాన్య ప్రజల్లోని కొందరి నుంచి, రాజకీయ వర్గాల నుంచి వినిపించింది. ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు పోలీసుల చర్యలను ప్రశ్నించాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది.
అయితే ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా మాత్రం నేరుగా రంగంలోకి దిగలేదు. జగన్ ప్రశ్న రావణ్‌కు బహిరంగ మద్దతు ప్రకటించలేదు. పోలీసుల చర్యలను నేరుగా తీవ్రంగా ఖండించలేదు. సాధారణంగా ప్రభుత్వంపై విమర్శలు చేసే వ్యక్తిపై వరుస కేసులు నమోదైతే ప్రతిపక్ష పార్టీలు స్పందించడం సహజం. కానీ ఈ వ్యవహారంలో జగన్ మౌనం పాటించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఆయనకు ఈ మొత్తం వ్యవహారంలో దాగి ఉన్న రాజకీయ ప్రమాదం ముందుగానే కనిపించిందా..? అనే ప్రశ్న ఇక్కడే ఉత్పన్నమవుతోంది.
జగన్‌కు రాజకీయ ఉచ్చు కనిపించిందా..?
జగన్ రాజకీయ అనుభవం లేని నాయకుడు కాదు. సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించారు. అలాంటి జగన్‌కు ప్రశ్న రావణ్ వ్యవహారంలో దాగి ఉన్న రాజకీయ ప్రమాదం అర్థం కాకుండా ఉంటుందా..? ప్రశ్న రావణ్‌కు జగన్ బహిరంగంగా మద్దతు ప్రకటిస్తే ఆ తర్వాత అధికార కూటమి ఎలాంటి ప్రచారం చేస్తుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. “హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు జగన్ మద్దతు ఇస్తున్నారు”, “జగన్‌కు హిందువుల మనోభావాల కంటే క్రైస్తవ వర్గాలే ముఖ్యమా..?”, “వైకాపా ఒక మతానికి అనుకూలంగా వ్యవహరిస్తోందా..?” అనే ప్రశ్నలను అధికార కూటమి ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.
ఏలూరు సభలో చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యల వీడియోలను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు. వాటికి జగన్ మద్దతును జోడించి రాజకీయ ప్రచారం చేయవచ్చు. అప్పుడు ప్రశ్న రావణ్‌పై ఎన్ని కేసులు నమోదయ్యాయి..? పోలీసుల చర్యలు సమంజసమా..? UAPA సెక్షన్లు వర్తిస్తాయా..? అనే అసలు చర్చ వెనక్కి వెళ్లిపోతుంది. దాని స్థానంలో “జగన్ వర్సెస్ హిందూ మనోభావాలు” అనే రాజకీయ కథనం ముందుకొచ్చే ప్రమాదం ఉంది. బహుశా జగన్ మౌనానికి కారణం ఇదేనా..? అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
UAPA.. జగన్‌కు విసిరిన రాజకీయ సవాలా..?
సాధారణ కేసులు నమోదైనప్పుడు జగన్ స్పందించలేదు. వరుస అరెస్టులపైనా నేరుగా స్పందించలేదు. ఇప్పుడు ప్రశ్న రావణ్‌పై UAPA సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇక్కడే రాజకీయ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఒక యూట్యూబర్‌పై UAPA వంటి తీవ్రమైన చట్టంలోని సెక్షన్లు ప్రయోగించడం సహజంగానే పెద్ద చర్చకు కారణమైంది. కేసులోని ఆరోపణలు, దర్యాప్తు ఆధారాలు, చట్టపరమైన సెక్షన్ల వర్తింపు వంటి అంశాలపై చివరకు న్యాయస్థానాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రాజకీయంగా మాత్రం మరో ప్రశ్న ముందుకొస్తోంది.
నాలుగు కేసులకు స్పందించని జగన్.. UAPA కేసుతోనైనా స్పందిస్తారా..? అధికార కూటమి కూడా అదే ఎదురుచూస్తోందా..? ప్రశ్న రావణ్ వ్యవహారాన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకెళ్లడం ద్వారా జగన్‌ను బహిరంగంగా స్పందించాల్సిన పరిస్థితిలోకి నెడుతున్నారా..? ఇది నిజంగా ఒక రాజకీయ వ్యూహమైతే దాని లక్ష్యం ప్రశ్న రావణ్ కాకపోవచ్చు. అసలు లక్ష్యం జగన్ కావచ్చు. జగన్ ఒక్కసారి బహిరంగంగా స్పందిస్తే మొత్తం రాజకీయ చర్చను ఆయన చుట్టూ తిప్పే అవకాశం కూటమికి లభిస్తుంది.
జగన్ మాట్లాడితే కథే మారిపోతుందా..?
జగన్ ఒక్కసారి ప్రశ్న రావణ్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తే ఆ తర్వాత రాజకీయ చర్చ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ప్రశ్న రావణ్‌పై నమోదైన కేసులు వెనక్కి వెళ్తాయి. UAPA సరైందా..? కాదా..? అనే న్యాయపరమైన చర్చ కూడా పక్కకు వెళ్లవచ్చు. ఏలూరు సభ వీడియోలు ముందుకొస్తాయి. జడ శ్రావణ్‌కుమార్ వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతాయి. ప్రశ్న రావణ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావచ్చు. ఆ తర్వాత అధికార కూటమి “వీరినే జగన్ సమర్థిస్తున్నారా..?” అనే ఒకే ప్రశ్నను ప్రజల ముందుంచే అవకాశం ఉంది.
అంతే.. రాజకీయ కథనం మారిపోతుంది. “ప్రశ్న రావణ్ వర్సెస్ ప్రభుత్వం” అనే చర్చ స్థానంలో “జగన్ వర్సెస్ హిందూ మనోభావాలు” అనే ప్రచారం ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. అధికార కూటమికి కావాల్సింది కూడా ఇదేనా..? అనే అనుమానం అందుకే వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో అసలు అంశాన్ని పక్కకు నెట్టి, ప్రత్యర్థిని రక్షణాత్మక స్థితిలోకి నెట్టడం కొత్త వ్యూహం కాదు. ఇప్పుడు ప్రశ్న రావణ్ వ్యవహారంలోనూ అదే జరుగుతోందా..? అనే చర్చ సాగుతోంది.
లడ్డూ వివాదం తర్వాత మరో పరీక్ష
జగన్‌కు గతంలోని తిరుమల లడ్డూ వివాదం కూడా రాజకీయంగా ఒక హెచ్చరికగా ఉండవచ్చు. ఆ వివాదం సమయంలో జగన్‌పై హిందూ వ్యతిరేక ముద్ర వేసేందుకు అధికార కూటమి తీవ్రంగా ప్రయత్నించింది. హిందూ ఆలయాలు, హిందువుల మనోభావాల విషయంలో వైకాపా ప్రభుత్వ వైఖరిపై విస్తృత ప్రచారం జరిగింది. ఆ ప్రచారం వైకాపాకు ఎంత రాజకీయ నష్టం చేసిందనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ హిందూ ఓటర్లలోని ఒక వర్గంలో జగన్‌పై అనుమానాలు పెరిగాయనే విశ్లేషణలు అప్పట్లో వినిపించాయి.
ఇప్పుడు ప్రశ్న రావణ్ వ్యవహారంలో జగన్ బహిరంగంగా రంగంలోకి దిగితే తిరుమల లడ్డూ వివాదాన్ని, ఏలూరు సభ వ్యాఖ్యలను కలిపి కొత్త రాజకీయ కథనాన్ని కూటమి నిర్మించే అవకాశం ఉంది. గతంలోని ఆరోపణలను మరోసారి తెరపైకి తీసుకొచ్చి, జగన్ ఒక మతానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారానికి పదును పెట్టవచ్చు. జగన్‌కు ఈ ప్రమాదం తెలియకుండా ఉంటుందా..? అందుకే ఆయన ఇప్పటివరకు మౌనం పాటిస్తున్నారా..? అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది.
మౌనం పాటిస్తే ఓటుబ్యాంకులో చీలిక..?
అయితే జగన్ మౌనంగా ఉండటం కూడా రాజకీయంగా సురక్షితమైన మార్గం కాదు. ప్రశ్న రావణ్‌పై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చివరకు UAPA సెక్షన్లు కూడా నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో జగన్ పూర్తిగా మౌనంగా ఉంటే వైకాపాకు సంప్రదాయంగా అండగా ఉన్న దళిత క్రైస్తవులు, క్రైస్తవుల్లోని కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఏర్పడే అవకాశం లేకపోలేదు.
“మన సమస్యల గురించి మాట్లాడుతున్నామని చెప్పే వ్యక్తులపై ఇన్ని కేసులు నమోదైతే జగన్ ఎందుకు స్పందించడం లేదు..?” అనే ప్రశ్న ఆ వర్గాల్లో మొదలైతే వైకాపాకు రాజకీయంగా ఇబ్బందే. అధికారంలో ఉన్నప్పుడు తమ ఓట్లు కోరిన పార్టీ ఇప్పుడు తమ సమస్యలపై మాట్లాడటం లేదనే భావన ఏర్పడితే అది వైకాపా ఓటుబ్యాంకుపై ప్రభావం చూపవచ్చు. అంటే జగన్ మాట్లాడితే ఒక ప్రమాదం.. మౌనంగా ఉంటే మరో ప్రమాదం. నిజంగానే ఆయన పరిస్థితి ఇప్పుడు ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్నట్లుగా మారిందా..? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైకాపా అస్త్రమే ఇప్పుడు జగన్ వైపు తిరిగిందా..?
రాజకీయాల్లో ఒక వ్యూహం ఎప్పటికీ ఒకే పార్టీకి ఉపయోగపడదు. నిన్న ప్రత్యర్థిపై ప్రయోగించిన అస్త్రం రేపు మనవైపే తిరిగి రావచ్చు. కులం, మతం, సామాజికవర్గం వంటి సున్నితమైన అంశాలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడం తాత్కాలికంగా ప్రయోజనం కలిగించవచ్చు. కానీ అదే రాజకీయ పద్ధతి తిరిగి తమ ముందుకు వచ్చినప్పుడు సమాధానం చెప్పడం కష్టమవుతుంది.
నాడు పవన్‌ను వైకాపా “కాపులకు అన్యాయం జరుగుతుంటే నువ్వెక్కడ..?” అని ప్రశ్నించింది. ఇప్పుడు పరిస్థితులు జగన్ ముందు “దళిత క్రైస్తవుల సమస్యలపై మాట్లాడుతున్నామని చెప్పే వారిపై కేసులు నమోదవుతుంటే నువ్వెక్కడ..?” అనే ప్రశ్నను ఉంచుతున్నాయా..? జగన్ సమాధానం చెబితే అధికార కూటమి సిద్ధంగా ఉందా..? చెప్పకపోతే వైకాపా ఓటుబ్యాంకులోని కొన్ని వర్గాల్లో ప్రశ్నలు మొదలవుతాయా..? ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశం.
పవన్–చంద్రబాబు బుట్టలో జగన్ పడతారా..?
ప్రశ్న రావణ్ వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక యూట్యూబర్‌పై నమోదైన కేసుల అంశంగా మాత్రమే మిగలలేదు. అది రాజకీయ చదరంగంలో ఒక పావుగా మారుతోందా..? ఆ పావును ముందుకు జరిపి జగన్‌ను బయటకు రప్పించాలని అధికార కూటమి చూస్తోందా..? జగన్ బయటకు వస్తే హిందూ ఓటర్ల ముందు ఆయనను రాజకీయంగా నిలబెట్టాలి. బయటకు రాకపోతే వైకాపాకు అండగా ఉన్న సామాజిక, మత వర్గాల్లో ప్రశ్నలు రేపాలి. ఇదే అధికార కూటమి వ్యూహమైతే జగన్‌కు ఇది సాధారణ రాజకీయ పరీక్ష కాదు. అత్యంత క్లిష్టమైన రాజకీయ పరీక్ష.
మరి జగన్ ఏం చేస్తారు..? ప్రశ్న రావణ్‌కు మద్దతుగా బహిరంగంగా రంగంలోకి దిగుతారా..? మౌనాన్నే రాజకీయ ఆయుధంగా కొనసాగిస్తారా..? లేక అధికార కూటమి ఊహించని మరో ఎత్తు వేస్తారా..? వైకాపా గతంలో ప్రయోగించిందనే విమర్శలు ఎదుర్కొన్న కుల, మత రాజకీయ అస్త్రమే ఇప్పుడు జగన్ చుట్టూ రాజకీయ వలగా మారుతోందా..? పవన్–చంద్రబాబు పన్నినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న ఈ బుట్టలో జగన్ పడతారా..? లేక బుట్టను ముందే గుర్తించి పక్కకు తప్పుకుంటారా..?
వేచి చూడాలి..!