ఘర్.. ఘర్ కీ కహానీ.. సుఖాంతమేనా!?
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి కుటుంబ సమస్యలను పరిష్కరించుకున్నారని, ఆయన సోదరి, తల్లితో ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఒక అవగాహనకు వచ్చారని, వారికి ఇవ్వాల్సిన వాటా ఇచ్చారని, ఇక ఆయనకు కుటుంబ సమస్యలు లేవని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
అన్నాచెల్లెళ్ల మధ్య మొదలైన విభేదాలు.. ఆస్తి వివాదంగా మారిన వైనం
2019 ఎన్నికల్లో వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొద్ది కాలానికి ఆయనకు, ఆయన సోదరికి విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే, ఆ విషయం అప్పట్లో బయటకు రాలేదు. కొన్నాళ్ల తర్వాత ఆయన సోదరి తెలంగాణలో పార్టీ ప్రారంభించారు. తెలంగాణలో రాజశేఖర్‌రెడ్డి పాలన తేవడమే లక్ష్యమంటూ ఆమె అప్పట్లో అక్కడ పాదయాత్ర చేశారు. అయితే, అక్కడ ఆమెకు ప్రజల నుంచి పెద్దగా సానుకూలత లభించలేదు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలయ్యారు.
ఆంధ్రా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆమె తన సోదరుడిపై నిప్పులు చెరుగుతున్నారు. తన తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వలేదని, చెల్లిపై కక్ష కట్టారని, ఇలాంటి అన్న ఎవరికీ ఉండకూడదంటూ ఆమె విలపించారు. అన్నపై షర్మిల ధ్వజమెత్తగా.. జగన్ కూడా ఆమెపై విరుచుకుపడ్డారు. తన ప్రత్యర్థులను కలుస్తున్నారని, రాజశేఖర్‌రెడ్డి వ్యతిరేకులను పసుపు చీర ధరించి కలిశారని ఆయన చెల్లిపై ఆరోపణలు గుప్పించారు.
వీరి మధ్య విభేదాలు షర్మిల తనయుడి వివాహం సందర్భంగా మరింత కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఆ తర్వాత ఆస్తి వివాదాలపై విజయమ్మ బహిరంగ లేఖలు రాయడం, అనంతరం ఆమె కూడా జగన్ తన చెల్లికి ఆస్తి ఇవ్వడం లేదని ఆరోపించడం.. ఇలా వరుసగా విభేదాలు ముదురుతూ వచ్చాయి. ఈ విభేదాలు చివరకు జగన్ ఓటమి వరకు సాగాయి.
2024 ఎన్నికల తర్వాత మళ్లీ కలపడానికి ప్రయత్నాలు.. ఆస్తి పంపకంపై రాజీ?
2024 ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయన సన్నిహితులు, రాజశేఖర్‌రెడ్డి సన్నిహితులు వారిని మళ్లీ కలపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవాలని రాజశేఖర్‌రెడ్డి సన్నిహితులు జగన్‌కు సూచించడంతో.. చివరకు ఆయన ఒప్పుకున్నారని, ఆస్తిలో వాటాలు పంచడానికి ఓకే అన్నారని ప్రచారం జరుగుతోంది.
ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ, షర్మిలకు ఆస్తి పంచి ఇవ్వడానికి జగన్ ఒప్పుకున్నారని, జగన్‌కు సన్నిహితంగా ఉండే ఒక వైకాపా సీనియర్ నాయకుడు ఈ వార్తా రచయితతో అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. చాలా వరకు అది నిజమేననే భావన వ్యక్తమవుతోంది.
శుభలేఖతో తాడేపల్లికి షర్మిల.. రాజీకి మార్గం ఏర్పడిందా?
కాగా, ఇప్పుడు తన కుమార్తె వివాహం సందర్భంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి షర్మిల వెళ్లి శుభలేఖ ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు ఉన్న విభేదాలన్నీ సమసిపోయాయని కాదు కానీ.. ఇద్దరి మధ్య రాజీకి మార్గం ఏర్పడిందని చెప్పవచ్చు.
అయితే, ఆస్తి విషయంలో రాజీ పడినా.. షర్మిల రాజకీయ పరిస్థితిపై జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, వారి మధ్య మళ్లీ విభేదాలు తలెత్తుతాయో లేదో అనేది ఆసక్తికరంగా మారింది.
ఆస్తి వివాదం పరిష్కారమైనా.. రాజకీయంగా మళ్లీ కలిసేనా?
గతంలో జగన్ జైలులో ఉన్నప్పుడు.. ఆయన వదిలిన బాణం అంటూ షర్మిల దాదాపు 1,500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ కనీసం ఆమెకు రాజ్యసభ సీటు ఇవ్వమన్నా ఇవ్వలేదని, దానికే షర్మిల మనస్తాపం చెందారనే ప్రచారం ఉంది.
మరి ఇప్పుడు ఇద్దరూ రాజీపడితే.. షర్మిలకు రాజకీయంగా ఏదైనా పదవి ఇస్తారా? ఇస్తే.. పార్టీ పదవా? లేక రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన పదవి ఇస్తారా? ఇలా అనేక సందేహాలు ఉన్నాయి.
అయితే, విభేదాలు ఎన్ని ఉన్నా.. మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన తల్లి విజయమ్మ తహతహలాడుతున్నారని, కుమార్తెకు ఆమె నచ్చచెబుతున్నారని, జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలంటే కుటుంబం కలిసి ఉండాలని, ఈ పరిస్థితుల్లో అన్నాచెల్లెళ్లు రాజీపడాలని ఆమె పదేపదే చెబుతున్నారనే ప్రచారం ఉంది.
మొత్తం మీద.. ఆ మధ్య సోదరితో విభేదాల గురించి మీడియా జగన్‌ను ప్రశ్నించినప్పుడు.. ఆయన దాన్ని తేలిక చేస్తూ, ఇటువంటి ‘ఘర్ ఘర్ కీ కహానీ’ ప్రతి ఇంటిలో ఉంటుందని చెప్పుకున్నారు.
ఆయన అన్నట్లే.. ఆయన ‘ఘర్ ఘర్ కీ కహానీ’ సుఖాంతమైందా..? అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న.