కాకినాడ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో435 అర్జీలు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను త్వరితగతిన,నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, సీపీవో పీ.త్రినాథ్, డీఎల్డీవో వాసుదేవరావు తదితర అధికారులతో కలిసి నిర్వహించి, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం, సమగ్రమైన విచారాణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులలోని పేర్లు మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మురికి కాలువలపై ఆక్రమణలు తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై మొత్తం 435 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారాలను వేగంగా అందించాలన్నారు. లబ్ధిదారుల సంతృప్తి స్థాయిని పెంచే లక్ష్యంతో ప్రతి అర్జీని తప్పనిసరిగా గడువులోపు పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. అర్జీలు పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు

రెవెన్యూ క్లినిక్ కు 19 అర్జీలు

రెవిన్యూశాఖలో సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వివేకానంద హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో డా‌.టి.తిప్పే నాయక్, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు ఎస్ మల్లి బాబు, ఎన్.శ్రీధర్ కెఆర్ఆర్సీ ఎస్డీసీ జి.రత్నమణిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రీ సర్వే, భూముల వివరాలు ఆన్ లైన్ లో నమోదు, జాయింట్ ఎల్పీఎంలు, 22ఏలోని భూములు, సర్వే నెంబర్లు ఇతర రెవెన్యూ అంశాలపై మొత్తం 19 అర్జీలు అందాయని డీఆర్వో తిప్పే నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి తిప్పే నాయక్.. రెవెన్యూ డివిజన్ అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లతో అర్జీల పరిష్కార పురోగతిపై సమీక్ష నిర్వహించి ఈ అర్జీలను గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమాలలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లు, సర్వే అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా రూ 6.25 లక్షల విలువైన ల్యాప్ ట్యాప్ లను, స్మార్ట్ ఫోన్లను 19 మంది విభిన్న ప్రతిభావంతులకు అందించిన జిల్లా కలెక్టర్ ఎం,ఎన్. హరేంధిర ప్రసాద్.