కర్షక్ క్రాప్ సైన్సెస్పై విజిలెన్స్ దాడులు
రూ.45.88 లక్షల విలువైన మిరప విత్తనాల అమ్మకాల నిలిపివేత
నిబంధనలు బేఖాతరు చేసిన కంపెనీపై కఠిన చర్యలు.. లైసెన్స్ వ్యవహారంపై అనుమానాలు
గుంటూరు, మే 27: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలో విజిలెన్స్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కుర్నూతల గ్రామంలో ఉన్న కర్షక్ క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మిరప విత్తనాల ప్యాకింగ్, నిల్వ, విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
రాష్ట్ర విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు, గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి డి. సూర్య శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. తనిఖీల సమయంలో సంస్థలో నిర్వహించాల్సిన తప్పనిసరి రికార్డుల్లో అనేక లోపాలు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.
విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో స్టాక్ రిజిస్టర్, ప్రాసెసింగ్ సీడ్ రిజిస్టర్ వంటి కీలక పత్రాలను సక్రమంగా నిర్వహించకపోవడం గుర్తించారు. అంతేకాకుండా, విత్తనాల కొనుగోలు, నిల్వ, సరఫరాకు సంబంధించిన ఇన్వాయిస్లు, సోర్స్ సర్టిఫికెట్లు కూడా అందుబాటులో లేకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. నిబంధనల ప్రకారం ప్రతి విత్తన లాట్కు సరైన ఆధారాలు ఉండాల్సి ఉండగా, సంస్థ వద్ద అవి లేకపోవడం తీవ్ర ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు.
తనిఖీల్లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ప్రభుత్వ అనుమతులు, ప్రమాణాలు పాటించకుండా వివిధ రకాల మిరప విత్తనాలను ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా “సూపర్-10”, “రెడ్ లైన్” వంటి మిరప విత్తనాలతో పాటు మరికొన్ని రకాల “రెమినెంట్” విత్తనాలను నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచి విక్రయాలకు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
దీంతో వెంటనే చర్యలు తీసుకున్న విజిలెన్స్ అధికారులు మొత్తం 11,677.5 కిలోల మిరప విత్తనాల ప్యాకింగ్, పంపిణీ, అమ్మకాలపై నిషేధం విధించారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.45,88,515గా అంచనా వేశారు. సంబంధిత విత్తనాల విక్రయాలను నిలిపివేస్తూ సంస్థకు నోటీసులు జారీ చేశారు.
ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఇదే కర్షక్ క్రాప్ సైన్సెస్ సంస్థపై 2024 సంవత్సరంలో కూడా విజిలెన్స్ శాఖ తనిఖీలు నిర్వహించి పలు లోపాలను గుర్తించింది. అప్పట్లో కూడా సంస్థ రికార్డుల నిర్వహణ, నాణ్యత ప్రమాణాలు, లైసెన్సింగ్ వ్యవహారాలపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ సంస్థ యాజమాన్యం ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు మరోసారి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ప్రభుత్వ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తూ వస్తున్నప్పటికీ సంబంధిత సంస్థ నిర్లక్ష్య ధోరణి మార్చుకోకపోవడం రైతు సంఘాల్లో ఆందోళన కలిగిస్తోంది. రైతులు నాణ్యమైన విత్తనాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుండగా, ఇలాంటి అక్రమాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, కర్షక్ క్రాప్ సైన్సెస్ సంస్థ లైసెన్స్ వ్యవహారంపై కూడా మార్కెట్ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీ లైసెన్స్ మంజూరులోనే “మాయాజాలం” జరిగిందనే ప్రచారం ప్రస్తుతం గుంటూరు విత్తన మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. పలు లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సంస్థ ఎలా కార్యకలాపాలు కొనసాగిస్తోందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై సంబంధిత శాఖలు లోతైన విచారణ చేపట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
విజిలెన్స్ అధికారులు మాత్రం రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తున్నారు. నాణ్యత లేని లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.
ఈ దాడుల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ కె. చంద్రశేఖర్, విజిలెన్స్ తహసీల్దార్ లక్ష్మీ మాధవి, వట్టిచెరుకూరు మండల వ్యవసాయ శాఖ అధికారిణి సి.హెచ్. సునీత తదితరులు పాల్గొన్నారు.