ఏపీ పోలీస్ శాఖలో భారీ ప్రమోషన్లు.. 41 మంది DSPలకు Additional SP పదోన్నతి

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

విజయవాడ, మే 27: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక ప్రమోషన్లు ప్రకటించింది. 2025-26 ప్యానెల్ సంవత్సరానికి గాను 41 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) అధికారులను అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (Additional SP) హోదాకు పదోన్నతి కల్పిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

హోం (సర్వీసెస్-I) శాఖ జారీ చేసిన G.O.Rt.No.675 ప్రకారం ఈ ప్రమోషన్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సిఫార్సుల మేరకు అమల్లోకి వచ్చాయి. పదోన్నతి పొందిన అధికారులు 15 రోజులలోగా తమ కొత్త బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇప్పటికే అడ్హాక్ అదనపు ఎస్పీలుగా పనిచేస్తున్న పలువురు అధికారులను వారి ప్రస్తుత పోస్టుల్లోనే రెగ్యులర్ చేసింది. మొహన్ రావు ఎల్ అనకాపల్లి అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్)గా కొనసాగుతుండగా, మురళీకృష్ణ ఎన్‌బీఎం ఎన్టీఆర్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్)గా కొనసాగనున్నారు. అలాగే రామకృష్ణ ఐ తిరుమల అదనపు ఎస్పీ (లా అండ్ ఆర్డర్)గా కొనసాగనున్నారు.

కొత్తగా పదోన్నతి పొందిన పలువురు అధికారులను మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్కడ నుంచి వారికి తదుపరి పోస్టింగులు కేటాయించనున్నారు.

ఈ ప్రమోషన్ జాబితాలో మహిళా అధికారులకు కూడా ప్రాధాన్యం లభించింది. పద్మలత, కే. శ్రావంతి రాయ్, ఎం. శ్రావణి, ఎన్. రమ్య, ఎస్‌ఆర్‌సీ హర్షిత తదితర మహిళా అధికారులు అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందారు.

పెండింగ్ కోర్టు కేసుల తుది తీర్పులకు లోబడి ఈ ప్రమోషన్లు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా జాయిన్ కాకపోతే ప్రమోషన్ హక్కులు కోల్పోయే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది.

రాష్ట్రంలో పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఈ ప్రమోషన్లు కీలకంగా మారనున్నాయని అధికారులు భావిస్తున్నారు.