రొయ్యల ఫీడ్ కంపెనీలకు మంత్రి అచ్చెన్నాయుడు వార్నింగ్.. రైతులపై భారం మోపొద్దు
అమరావతి, మే 13ః రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ష్రిమ్ప్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఆక్వా రైతులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఫీడ్ ధరలను ఒక్కసారిగా పెంచడం వల్ల ఆక్వా రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని రైతులు సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు నష్టం కలిగించే విధంగా ఎలాంటి నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోరాదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఇటీవల పెంచిన ఫీడ్ ధరల అమలును తక్షణమే నిలిపివేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సూచనలను గౌరవిస్తూ ఫీడ్ ధరల పెంపును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
రైతుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆక్వా రంగానికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు.
ఇక శుక్రవారం మరోసారి రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, అధికారులతో ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తీసుకునే నిర్ణయాన్నే అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.