బీజేపీ కార్యాలయం తొలగింపుపై ఆందోళన.. కమిషనర్ సస్పెన్షన్‌కు డిమాండ్

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

నెల్లూరు, మే 13ః నెల్లూరు నగరంలోని కిసాన్ నగర్–ప్రశాంతి నగర్ ప్రాంతంలో బీజేపీ కార్యాలయం తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ స్థలంలో నిర్మాణం ఉందంటూ గతంలో మున్సిపల్ అధికారులు బీజేపీ కార్యాలయాన్ని తొలగించగా, బుధవారం బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కార్యాలయాన్ని తిరిగి నిర్మించే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి నిరసన చేపట్టాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బీజేపీ రాష్ట్ర నాయకుడు సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి తదితర నేతలు అక్కడే ఉండి కార్యాలయ పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించారు. బీజేపీ కార్యాలయాన్ని కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించిన వారు.. నెల్లూరు నగర కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. “భారతీయ జనతా పార్టీ అల్లాటప్ప పార్టీ కాదు.. జాతీయ పార్టీ. మా కార్యాలయాన్ని ఎలా కూల్చివేస్తారు?” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

మంత్రి నారాయణపై బీజేపీ నేతల ఆగ్రహం

మంత్రి నారాయణ చుట్టూ “దుష్ట గ్రహాలు” చేరాయని సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములమై ఉన్న తమ పార్టీకి ఇదేనా గౌరవమని ప్రశ్నించారు.

“మా కార్యాలయాన్ని మీ నాయకులు దగ్గరుండి కూల్చివేస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తోంది? బీజేపీ కార్యాలయం మాకు దేవాలయం లాంటిది. మా జెండాను కుప్పతొట్టిలో వేయడం మమ్మల్ని అవమానపరచడమే” అని ఆయన మండిపడ్డారు.

మంత్రి నారాయణ చుట్టూ వైసీపీ నుంచి వచ్చిన నాయకులు చేరి ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు నగర కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, కిసాన్ నగర్‌లో బీజేపీ కార్యాలయానికి ద్వారబంధం ఏర్పాటు చేసి పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.