ఫ్రొఫెసర్ నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు టిడిపికి మేలు చేసేవే...!?
గత నాలుగైదు రోజులుగా తెలంగాణకు చెందిన మేధావి,మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ కూటమి గురించి, ముఖ్యంగా చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై టిడిపి, జనసేన వర్గాలు మండిపడుతున్నాయి. ఆయనకు బుద్దిలేదని, అమ్ముడుపోయాడని, వైకాపాకు లబ్ది చేకూర్చేందుకు యత్నిస్తున్నారని, టిడిపి, జనసేనల మధ్య చిచ్చుపెట్టడానికి యత్నిస్తున్నాడని, రాష్ట్రంలో కూటమిని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి, జనసేనలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ పార్టీలకు మద్దతు ఇచ్చే యూట్యూబ్ ఛానెల్స్ నాగేశ్వర్‌కు వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాయి. అయితే..ఇంతకీ నాగేశ్వర్ ఏమన్నాడో తెలుసుకుందాం.
జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్...చంద్రబాబు షార్ట్ టర్మ్ ఫ్రెండ్...!?
ఇటీవల కాలంలో జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి మేము వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని తట్టుకోలేకపోతున్నాం..ఆయనను అరెస్టు చేయండి అని అడిగారని, దానికి హోంమంత్రి అమిత్‌షా బదులిస్తూ..జగన్ మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్..చంద్రబాబు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అని...చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాదని, జగన్ అయితే..నమ్మదగని వ్యక్తి కనుక ఆయనకే తమ మద్దతు ఉంటుందని అన్నారని, ఈ విషయం తనకు జనసేన కోర్ కమిటీ సభ్యుడు ఒకరు చెప్పారని నాగేశ్వర్ తన యూట్యూబ్ ఛానెల్లో చెప్పుకున్నారు. అంతేనా..జగన్ కేంద్రంలో ఎప్పుడు అవసరం వచ్చినా..ఏమీ అడగకుండానే తమకు మద్దతు ఇస్తున్నారని, 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు, రాజ్యసభలో ఆయనకు బలం ఉన్నప్పుడు కూడా తమకు మద్దతు ఇస్తున్నారని, అటువంటి నాయకుడినే తాము నమ్ముతామని, మీరు కూడా జగన్‌తో వైరం పెట్టుకోవద్దని హోంమంత్రి సూచించారని కూడా ఆయన సెలవిచ్చారు. ఇప్పుడు దీనిపైనే రాద్ధాంతం జరుగుతోంది.
అమిత్‌షా పేరుతో నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
కేంద్రంలో టిడిపి మద్దతుతో ఏర్పడిన బిజెపి కూటమి ప్రభుత్వంలోని కీలకమైన నాయకుడు చంద్రబాబును అంత మాట అంటారా..? అమిత్‌షా నిజంగా ఆ మాట అన్నారా..? అసలు జనసేన అధ్యక్షుడు అమిత్‌షాను కలిసి జగన్‌ను అరెస్టు చేయమని అడిగారా..? అయితే..ఇవన్నీ ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్నలు..ఇద్దరు వ్యక్తులు మధ్య జరిగిన విషయాల గురించి వారు వెల్లడించకుండా...వేరే వ్యక్తులు వెల్లడించడం అంటేనే దానిలో ఏదో మతలబు ఉంటుంది. ఈ మతలబు నాగేశ్వర్‌కే తెలియాలి? కూటమిలో కీలకమైన పవన్‌కళ్యాణ్ అయినా స్పందించాలి. కానీ..ఆయన అసలు పట్టించుకోలేదు. మరి ఆధారాలు లేని విషయాల గురించి నాగేశ్వర్ చెప్పడం వెనుక ఆయన ఉద్దేశ్యం ఏమై ఉంటుంది అంటే...వైకాపాకు లబ్ది చేకూర్చాలనే ఆయన ఆలోచన తప్ప మరేమీ లేదనే వాదన వివిధ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది.
బిజెపి-జగన్ సంబంధాలపై కొత్త చర్చకు తెరలేపిన నాగేశ్వర్
అయితే..ఇక్కడే..నాగేశ్వర్ తెలివిని మెచ్చుకోవాలి. ఎందుకుంటే...వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విషయంలో బిజెపి మొదటి నుంచి మెతకవైఖరిని అవలంభిస్తున్న విషయంలో దేశంలోని ప్రజలందరికీ తెలుసు. ఆయన వారి రహస్య స్నేహితుడనే విషయం కూడా తెలుసు. ఒకప్పుడు జగన్ మోడీకి దత్తపుత్రుడని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. అయితే..అప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు. జగన్ అవినీతి, హత్యా రాజకీయాల గురించి తెలిసినా..దానికి తగిన ఆధారాలు ఉన్నా..కేంద్ర పరిధిలో ఉండే సీబీఐకానీ, ఐటికానీ, ఈడీ కాని ఆయనను ఎప్పుడూ టచ్ చేయలేదు. ఎందుకుంటే..మోడీ, అమిత్‌షా ఆశీస్సులు ఆయనకు దండిగా ఉండడమే కారణం. ఆయన ప్రతిపక్షంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా..కనీసం ఆయనపై ఈగ వాలకపోవడానికి కూడా వాళ్లే కారణం అన్న సంగతి రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. దీన్నే..ఇప్పుడు నాగేశ్వర్ తెలివిగా వాడుకుని..ప్రజల్లో తాను చెప్పిన విషయం నిజమేనని భ్రమలు కల్పిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా..పవన్, నాదెండ్ల మనోహర్ వెళ్లి జగన్‌ను అరెస్టు చేయమని అడిగారనే ట్విస్ట్‌ను నాగేశ్వర్ తెలివిగా దీనిలో ఇరికించడమే ఇప్పుడు ఈ అంశం హైలెట్ అవడానికి కారణం. అయితే..ఇప్పుడు నాగేశ్వర్ చంద్రబాబును ఏదో అన్నారని, చంద్రబాబుకు బిజెపి పెద్దల్లో మద్దతు లేదని, జగన్‌కే ఉందని నాగేశ్వర్ ద్వారా చెప్పించడం వైకాపాకు లబ్ది చేకూరుతుందో...లేదో కానీ ముస్లిం వర్గాల్లో, క్రిస్టియన్ వర్గాల్లో జగన్ నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఏమి చేసినా..చెల్లింది. ఆయన బిజెపి పెట్టే ఏ బిల్లుకైనా పార్లమెంట్లో మద్దతు ఇచ్చినా..ఈ వర్గాలు..పెద్దగా పట్టించుకోలేదు..పైగా చేసేదేమీ లేదు. కానీ..రాబోయే ఎన్నికల నాటికి బిజెపి, జగన్‌ల లోపాయికారీ వ్యవహారాలు, కుమ్మక్కు రాజకీయాల గురించి ఈ వర్గాలు పూర్తిగా తెలుసుకుంటే..జగన్‌కు నష్టం తప్పదు.
“రాజకీయ వ్యభిచారం” కాదా...?
ఇటీవల వరకూ వైకాపా శిబిరంలో ఒక అనలిస్టుగా ఉండి..ఇటీవల మావిగాన్ విషయంలో వారితో విభేదించి బయటకు వచ్చిన తెలంగాణకు చెందిన ఫాషా అనే జర్నలిస్టు..నాగేశ్వర్ చెప్పిన విషయాల గురించి మాట్లాడుతూ..చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని అమిత్‌షా అన్నారంటున్నారు..అది సరే అనుకున్నా..జగన్ వలే రాజకీయ వ్యభిచారం చేయడం లేదు కదా..? అని ప్రశ్నించాడు...? చంద్రబాబు..బిజెపితో విబేధించినప్పుడు బహిరంగంగానే వ్యతిరేకించాడు...వారికి వ్యతిరేకంగా చేయాల్సిందంతా చేశాడు..వారిని ఓడించడానికి కూడా యత్నించాడు..సరే..వారితో మళ్లీ కలవాలన్నా..బహిరంగంగానే కలిశాడు. షంషేర్‌గా పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో గెలిచాడు..ఆయన అన్ని విషయాలు ప్రజలకు చెప్పే బిజెపితో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. మరి జగన్ ఏమి చేస్తున్నాడు..అంటే..పక్కా రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు.ముస్లింలు, మైనార్టీల ఓట్లతో గెలవడం..తరువాత బిజెపితో కలిసిపోవడం..వారేమో..మైనార్టీలపై దాడులుచేస్తున్నా..ఈయన మాత్రం ఉలకడు..పలకడు. ఇటువంటి రాజకీయ వ్యభిచారి..రాజకీయాల్లో ఎక్కడైనా ఉన్నాడా..? అని ఫాషా ఘాటుగా ప్రశ్నించారు. మా ముస్లింలు, క్రిస్టియన్లు ఆయనను గుడ్డిగా అనుసరిస్తున్నారని, వారిలో చైతన్యం వస్తే..జగన్ ఆటలకు చెక్ పడుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
టిడిపిలో ఎదురుదాడి ఏది...?
ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి నుంచి అంతగా ఎదురుదాడి కనిపించడం లేదు. అసలు ఎవరు నమ్మదగిన వ్యక్తో..కాదో..గత చరిత్ర చూడండి..అంటూ..టిడిపి ఎందుకు ప్రశ్నించడం లేదో తెలియదు. గతంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వానికి ఎటువంటి మంత్రి పదవులు ఆశించకుండా ఏడేళ్లపాటు మద్దతు ఇచ్చింది టిడిపి కాదా..? అప్పట్లో మంత్రి పదవులు తీసుకోమన్నా..తీసుకోకుండా..రాష్ట్రం కోసమే..పాటుపడింది చంద్రబాబు కాదా..? వాజ్‌పేయి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని..జయలలిత, మమతాబెనర్జీ, మాయవతి..ఒక ఆట ఆడుకుంటుంటే..వారి భారి నుంచి వాజ్‌పేయి ప్రభుత్వాన్ని రక్షించింది ఎవరు..? చంద్రబాబు కాదా..? అప్పట్లో కానీ..ఇప్పట్లో కానీ..చంద్రబాబు తన వ్యక్తిగత పనులు కానీ, ఇతర పదవుల విషయంలో ఏనాడైనా..తన మద్దతు అంశాన్ని చూపించి వ్యాపారాలు చేసుకున్నారా..? అని ప్రశ్నంచే నేతలు టిడిపిలో ఉన్నారా..? ఎందుకో టిడిపి ఈ విషయంలో..సోషల్ మీడియాలో జరుగుతోన్న చర్చ గురించి పట్టించుకోవడం లేదు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని మేధావుల ముసుగులో కించపరుస్తుంటే..వాస్తవాలు బయటకు చెప్పాల్సిన వారు..మౌనం దాలుస్తున్నారు. ఇది టిడిపి పెద్దల దృష్టికి వచ్చిందో..రాలేదో..? ఇప్పుడు నాగేశ్వర్ విషయంలో..ఆయన చేసిన వ్యాఖ్యలపై టిడిపి సరైన సమాధానంతో పాటు..ఎవరు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారో...క్రిస్టియన్, మైనార్టీ వర్గాలకు అర్థం అయ్యేలా చెబితే..టిడిపికే లాభం. అయితే..టిడిపిలో మైనార్టీ వర్గాల్లో చైతన్యం కలిగించే నాయకుడు లేకపోవడం పెద్దలోటు.