సామాజిక సేవకు గుర్తింపు.. పెద్దిరెడ్డి రామ్ సతీష్ రెడ్డికి గౌరవ డాక్టరేట్

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు.. పేదలు, అనాథలకు అండగా నిలుస్తున్న సేవా తత్పరుడు

చెన్నై, అక్టోబర్ 10: కడప జిల్లా బద్వేల్‌కు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు, పద్మావతి హాస్పిటల్‌కు సంబంధించిన పెద్దిరెడ్డి రామ్ సతీష్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ లభించింది. సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, ఆధ్యాత్మిక రంగాల్లో ఆయన చేస్తున్న కృషిని గుర్తిస్తూ అమెరికన్ యూనివర్సిటీ ఈ గౌరవాన్ని అందించింది. శనివారం చెన్నైలోని టీ.నగర్ కృష్ణ గాన సభ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధులు ఆయనకు డాక్టరేట్‌తో పాటు ధ్రువపత్రాన్ని అందజేశారు.

బద్వేల్ నియోజకవర్గంలో గత 30 ఏళ్లుగా రామ్ సతీష్ రెడ్డి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాలు, అనాథలకు అండగా నిలుస్తూ తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు చేపట్టి పచ్చదనం పెంపునకు కృషి చేస్తున్నారు. అడవుల్లో మూగజీవాల సంరక్షణకు తోడ్పడటంతో పాటు పేద ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు ప్రాంతాల్లో శ్మశానవాటికల నిర్మాణానికి సహకరించారు.

ఆయన అందిస్తున్న నిస్వార్థ సేవలను గుర్తించిన యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వ్యాపారవేత్తలు, వైద్యులు తదితరులు కూడా డాక్టరేట్లు అందుకున్నారు. సోషల్ వర్క్, సాఫ్ట్‌వేర్, వ్యాపారం, వైద్యం, క్రీడలు, సంగీతం, మార్షల్ ఆర్ట్స్ వంటి రంగాలకు చెందిన పలువురు ఈ గౌరవాన్ని అందుకున్నారు. హాంకాంగ్, మలేషియా, సింగపూర్, జపాన్ తదితర దేశాల నుంచి కూడా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా డాక్టర్ పెద్దిరెడ్డి రామ్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ పురస్కారంతో సమాజం పట్ల తన బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. ‘మంచి పనులు సేవా ఫౌండేషన్’ ద్వారా భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తానని, పేదలు, అనాథలకు అండగా నిలుస్తూ సామాజిక సేవలో మరింత చురుగ్గా ముందుకు సాగుతానని తెలిపారు.

గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ సతీష్ రెడ్డిని పలువురు ప్రముఖులు, స్నేహితులు, బంధువులు, అభిమానులు అభినందించారు.