రికార్డు స్థాయిలో ఎండలు.. కోస్తా ఆంధ్రాలో ఉష్ణోగ్రతలు 48°C దాటే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్లో ఎండలు భగ్గుమంటున్నాయి. మే నెల చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తాజా హెచ్చరికల ప్రకారం రాబోయే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 44.8 డిగ్రీలు నమోదవగా, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల పరిధిలోని 67 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
శనివారం రాష్ట్రంలోని 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 221 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా కోస్తా ఆంధ్రాలోని పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఈ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే గణనీయంగా ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గినా, వేడి గాలుల ప్రభావం మాత్రం కొనసాగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, గుండె సంబంధిత వ్యాధులు, బీపీ, షుగర్ ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని APSDMA హెచ్చరించింది. బయటకు వెళ్లాల్సి వస్తే తలకు గుడ్డ లేదా టోపీ ధరించడం, చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వేసవి తీవ్రతను తట్టుకునేందుకు ప్రజలు తరచుగా నీరు తాగడం, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎండలో ఎక్కువసేపు తిరగడం వల్ల డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
మరోవైపు ద్రోణి ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో రైతులు, పశుకాపరులు చెట్ల కింద నిలబడకుండా వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
ఇక ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణం నెలకొనడంతో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. మధ్యాహ్నం వేళల్లో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు.