బుధవారం కోస్తా జిల్లాల్లో భానుడు భగ్గుమంటాడు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

అమరావతి, మే 19:

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ Prakhar Jain తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు.

మంగళవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.6°C ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరు జిల్లా గూడూరులో 44.9°C, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5°C, మార్కాపురం జిల్లా పెదచెర్లోపల్లిలో 44.2°C, ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 44.1°C నమోదయ్యాయి. అలాగే బాపట్ల, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, అనకాపల్లి, తిరుపతి జిల్లాల్లో కూడా 42°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 23 జిల్లాలకు చెందిన మొత్తం 233 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలో అత్యధికంగా 26 మండలాలు, నెల్లూరులో 25 మండలాలు, ప్రకాశంలో 23 మండలాలు తీవ్ర ఎండ ప్రభావానికి గురయ్యాయి.

బుధవారం ఎక్కడెక్కడ తీవ్ర ఎండలు?

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 43°C నుంచి 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో 41°C నుంచి 43°C వరకు ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందన్నారు.

71 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా తదితర జిల్లాల్లోని 71 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 277 మండలాల్లో సాధారణ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ప్రజలకు హెచ్చరికలు

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావొద్దని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

ఇక మరోవైపు కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై ద్రోణి ప్రభావం ఉండటంతో రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.