నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
కలెక్టర్ తీరుపై సీఎం సంతృప్తి.. జిల్లాకు ప్రత్యేక గుర్తింపు
నెల్లూరు జిల్లా పరిపాలనపై ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ Himanshu Shukla నాయకత్వంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందని కొనియాడారు. కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన ‘మత్స్యకార సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, అనంతరం శాఖల వారీగా జిల్లా పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సగటుతో పోలిస్తే నెల్లూరు జిల్లా అనేక రంగాల్లో ముందంజలో ఉందని పేర్కొన్నారు.
ప్రజల నుంచి ప్రభుత్వ శాఖల పనితీరుపై అధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమవుతోందని సీఎం వెల్లడించారు. ముఖ్యంగా సామాజిక పింఛన్ల పంపిణీ, సీఎం రిలీఫ్ ఫండ్ అమలు, మిడ్ డే మీల్స్ నిర్వహణ, పాఠశాల విద్య, రీ సర్వే, వ్యవసాయ సేవలు వంటి అంశాల్లో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమన్నారు.
జిల్లాలో అధికారులు సమన్వయంతో పనిచేస్తున్న తీరు సీఎం దృష్టిని ఆకర్షించింది. ఇరిగేషన్ శాఖ పనితీరు రాష్ట్ర సగటుతో పోలిస్తే మెరుగ్గా ఉందని పేర్కొంటూ ఆ శాఖ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే వ్యవసాయ శాఖ రైతులకు యూరియా కొరత లేకుండా సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు. తాగునీటి సరఫరా, ధాన్యం సేకరణ, ఫైర్ సర్వీసెస్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సంస్థల నిర్వహణలోనూ అధికారులు మెరుగైన ఫలితాలు సాధించారని కొనియాడారు.
అంగన్వాడీ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులకు అందిస్తున్న సేవలను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. వీధి దీపాల నిర్వహణ, బీసీ హాస్టళ్ల పర్యవేక్షణ, ఆర్టీవో శాఖ పనితీరు కూడా సంతృప్తికరంగా ఉందన్నారు. జిల్లా పరిపాలనలో ప్రజలకు చేరువగా సేవలు అందించడం వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు.
సామాజిక పింఛన్ల పంపిణీలో 91 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం రాష్ట్రంలోనే అత్యధికమని సీఎం వెల్లడించారు. దీనికి డీఆర్డీఏ అధికారుల కృషి కారణమని పేర్కొన్నారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ అందించడంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషమన్నారు.
అయితే కొన్ని శాఖలు ఇంకా పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. ముఖ్యంగా దేవాలయాలకు తాగునీటి సరఫరాలో జిల్లా రాష్ట్ర సగటుతో పోలిస్తే వెనుకబడి ఉందని పేర్కొంటూ, అధికారులు ఈ అంశంపై మరింత దృష్టి పెట్టాలని ఆదేశించారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణను కూడా మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు. “ప్రజల్లో 90 శాతం మంది సంతృప్తి చెందేలా అధికారులు పనిచేయాలి. సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరాలి” అని సీఎం స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా పనితీరు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.