మోదీ సర్కార్పై షర్మిల ఫైర్.. ఇంధన ధరల పెంపు దోపిడీ అంటూ విమర్శలు
10 రోజుల్లో నాలుగోసారి పెరిగిన ఇంధన ధరలు
వ్యాట్, రోడ్ సెస్ తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్
ప్రజలపై రూ.1000 కోట్ల అదనపు భారం మోపుతున్న కేంద్రం: షర్మిల
ఇంధన ధరల పెంపుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరల పేరుతో కేంద్ర ప్రభుత్వం “వాయిదాల పద్ధతిలో దోపిడీ” చేస్తోందని మండిపడ్డారు.
గత 10 రోజుల్లో వరుసగా నాలుగు సార్లు ఇంధన ధరలు పెంచడం అత్యంత దారుణమని షర్మిల వ్యాఖ్యానించారు. రోజుకు దాదాపు రూ.1000 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ప్రజల కష్టాలు కనిపించడం లేదన్నారు.
ఇంధన ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజల సంపాదనను లాక్కొని పేదలను మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలను షర్మిల ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు మొత్తం భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు, ప్రజలు కలిసి భరించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు మొత్తం భారాన్ని ప్రజలపైనే మోపడం మోదీ ప్రభుత్వ దుర్మార్గ పాలనకు నిదర్శనమని అన్నారు.
చమురు ధరలు తగ్గినప్పుడు లాభాలను పొందిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ధరలు పెరిగాయని చెబుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని షర్మిల విమర్శించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లీటరు పెట్రోల్ ధర రూ.117.19కు, డీజిల్ ధర రూ.104.88కు చేరిందని తెలిపారు. దేశంలోనే ఏపీలో ఇంధన ధరలు అత్యధికంగా ఉన్నాయని ఆరోపించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా షర్మిల విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం భారం మోపుతున్నా సీఎం చంద్రబాబు నాయుడు మౌనం వహించడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో అధికంగా వసూలు చేస్తున్న రూ.4 వ్యాట్, రూ.1 రోడ్ సెస్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు కొంతైనా ఉపశమనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరుతున్నామని షర్మిల స్పష్టం చేశారు.