కాకినాడలో 43 కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ.. అధికారులకు ఫిర్యాదు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తోటపేట గ్రామంలో 43 కుటుంబాలు సాంఘిక బహిష్కరణకు గురయ్యామని ఆరోపిస్తూ అధికారులను ఆశ్రయించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించినందుకే గ్రామ పెద్దలు తమపై కక్ష సాధింపులకు దిగారని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి.

బాధితుల కథనం ప్రకారం, గత పది నెలలుగా గ్రామంలో తమపై వివిధ రకాల ఆంక్షలు అమలు చేస్తున్నారని తెలిపారు. కూలి పనులకు వెళ్లనివ్వకపోవడం, గ్రామంలోని కిరాణా దుకాణాల్లో సరుకులు అమ్మకుండా అడ్డుకోవడం, వివాహాలు, శుభకార్యాలు, సామూహిక కార్యక్రమాలకు పిలవకపోవడం వంటి చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. అంతేకాకుండా వ్యవసాయ పనుల్లో ఉపయోగించే వరి కోత యంత్రాలను కూడా తమ పొలాల్లోకి రానివ్వడం లేదని తెలిపారు.

గ్రామంలో సాధారణంగా సంచరించేటప్పుడు కూడా అవమానాలు ఎదుర్కొంటున్నామని, దారిన వెళ్తున్నా చోటు ఇవ్వకుండా మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. “మేము ఎటువంటి తప్పు చేయలేదు. గ్రామంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించి చట్టపరమైన మార్గంలో అధికారులను ఆశ్రయించడమే మా తప్పయింది” అని వారు చెబుతున్నారు.

ఈ అంశంపై బాధిత కుటుంబాలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, కాకినాడ రూరల్ సీఐ, కోరంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ, తాళ్లరేవు తహసిల్దార్‌లకు ఫిర్యాదులు సమర్పించారు. అధికారులు ఇరు వర్గాలను పిలిపించి పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం. అధికారుల సమక్షంలో గ్రామ పెద్దలు “ఇకపై ఎటువంటి వివాదాలు ఉండవు, అందరం కలిసిమెలిసి ఉంటాం” అంటూ హామీలు ఇచ్చి సంతకాలు కూడా చేసినట్లు బాధితులు తెలిపారు.

అయితే గ్రామానికి తిరిగి వెళ్లిన తరువాత మళ్లీ పాత పరిస్థితులే కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అధికారులు తీసుకున్న చర్యలు కాగితాలకే పరిమితమయ్యాయని, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని వారు అంటున్నారు.

ఇటీవల అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి, దాని బాధ్యతను బాధిత కుటుంబాలపై మోపేందుకు ప్రయత్నిస్తున్నారని మరో ఆరోపణ చేశారు. కొందరు రాజకీయ నేతలు కూడా ఈ వివాదాన్ని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో జిల్లా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. లేకపోతే 43 కుటుంబాలకు చెందిన మహిళలు, పురుషులు, చిన్నారులు అందరూ కలిసి తాళ్లరేవు తహసిల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు.