బాలికపై లైంగిక దాడి.. 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన ప్రత్యేక కోర్టు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ముద్దాయి పరసా బ్రహ్మయ్యకు మచిలీపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అదనంగా రూ.10 వేల జరిమానా విధించగా, జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల అదనపు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే బాధిత బాలికకు రూ.6 లక్షల నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి గాజుల వెంకటేశ్వర్లు ఆదేశించారు.

ఈ కేసు ఏలూరు జిల్లా కలిదిండి పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో నమోదైన క్రైమ్ నెంబర్ 39/2020కు సంబంధించినది. సెక్షన్ 376తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుడిపై అభియోగాలు బలంగా రుజువుకావడంతో కోర్టు కఠిన తీర్పు వెలువరించింది.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కోర్టు మానిటరింగ్ సెల్, దర్యాప్తు అధికారులు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేయడం వల్ల బాధిత బాలికకు న్యాయం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో అప్పటి ఎస్‌ఐ ఏడీఎల్ జనార్ధన్, దర్యాప్తు అధికారి ఎన్. సత్యానందం, ప్రస్తుత డీఎస్పీ డి. శ్రవణ్ కుమార్, సీఐ వి. రవికుమార్, ఎస్‌ఐలు వి. వెంకటేశ్వరరావు, ఎస్‌ఎస్‌ఎస్ పవన్ కుమార్, సిఎంసీ సిబ్బంది, హెచ్‌సీలు కీలకంగా పనిచేశారు. అలాగే స్పెషల్ పీపీలుగా ఎస్. చిన్నారావు, ఎం.వి. నరసింహారావు కోర్టులో బలమైన వాదనలు వినిపించి కేసు విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు.

ఈ సందర్భంగా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ సంబంధిత అధికారులను అభినందించారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.