పలుకే బంగారమాయినా..?
కార్యకర్తలను పలకరించని టీడీపీ ఎమ్మెల్యేలు..!
- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు ఇచ్చిన ప్రాధాన్యం..
- ఇప్పుడు మాత్రం ఎదురుగా ఉన్నా గుర్తించని వైనం..!
- పలికితే ఏమైనా ఇవ్వాల్సి వస్తుందేమోనన్న భయం..!
- ఏమి అడుగుతారో అన్న సందేహంతో దూరం.. దూరం..!
- రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేల తీరు ఇదేనా అన్న చర్చ..!
- బాపట్ల జిల్లాలో తొలిసారి గెలిచిన ఓ ఎమ్మెల్యే తీరు మరీ దారుణమని కార్యకర్తల ఆవేదన..!
- ఎన్నికలకు ముందు హడావుడి చేసిన ఎమ్మెల్యే..
- “గెలిస్తే ఇక చూసుకోండి” అన్న నాయకుడు.. ఇప్పుడు మాత్రం పలకరింపుకే దూరం..!
కార్యకర్తల కష్టంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ఇప్పుడు వారికే దూరమా..?
అమరావతి, మే 13ః కార్యకర్తల కృషితో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదనే భావన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ధన, మాన, ప్రాణాలకు తెగించి పోరాడి టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలు.. ఇప్పుడు తమ పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూసి ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరును చూసి.. ఎన్నికలకు ముందు ఉన్న వీళ్లు.. వీళ్లేనా..? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు జగన్పై పోరాటం చేస్తున్న కార్యకర్తలకు, సానుభూతిపరులకు ఎమ్మెల్యేలు అండదండలు అందించారు. వారు ఏమి అడిగినా.. “ఇంకేముంది.. అధికారంలోకి రానీయండి.. మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటాం” అంటూ హామీలు ఇచ్చారు.
అంతేనా.. కార్యకర్తలు కనిపిస్తే వారిని వాటేసుకుని, రాసుకుపూసుకుని తిరిగారు. నియోజకవర్గంలో పర్యటించినప్పుడు వారికి ఎన్నో హామీలు ఇచ్చారు. “జగన్ పార్టీ నాయకుల కంటే.. మనమే ఎక్కువ పనులు చేసుకుందాం.. గెలిస్తే మనదే రాజ్యం” అంటూ వారిని ఊహల పల్లకిలో ఊరేగించారు. వారు అడగక ముందే ధనసహాయం చేశారు. ఎక్కడైనా ఇబ్బంది ఉందని తెలిసినా.. అక్కడికి వెళ్లి ఎంతో కొంత భరోసా ఇచ్చేవారు. కార్యకర్తలే తమ ప్రాణమని, వారి కంటే ఇంకేమీ లేదన్నట్లు వ్యవహరించారు.
అప్పట్లో వారి తీరు చూసి టీడీపీ కార్యకర్తలు అబ్బురపడ్డారు. “ఇలాంటి నాయకులు అధికారంలోకి వస్తే ఇక పార్టీకి తిరుగేలేదు” అని భావించారు. కానీ ఇప్పుడు వారి వ్యవహారం చూసి.. “అసలు వీళ్లు వాళ్లేనా..?” అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకు ముందు అవసరం లేకపోయినా తమ చుట్టూ తిరిగిన నేతలు.. ఇప్పుడు అవసరం ఉండి వారి గుమ్మం తొక్కినా.. “వీళ్లు ఎవరో తెలియదు” అన్నట్లు వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. కనీసం ఎమ్మెల్యే ముందు నిల్చున్నా పలకరించడానికి కూడా మనసు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలకరిస్తే.. “ఏమవుతుందో.. ఏమి అడుగుతారో.. ఏ పని చెప్పమంటారో..” అన్నట్లు మొహం తిప్పుకుంటున్నారని విమర్శిస్తున్నారు. అందరూ అలా కాదని.. కానీ చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
బాపట్ల జిల్లాలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే తీరు మరీ దారుణం..!
బాపట్ల జిల్లాలో తొలిసారి గెలిచిన ఓ ఎమ్మెల్యే తీరు మరీ దారుణంగా ఉందని పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఈ నాయకుడు అడిగిన వారికి, అడగని వారికి సొమ్ములు గుమ్మరించారని చెబుతున్నారు. పార్టీ అగ్రనాయకత్వాన్ని ప్రసన్నం చేసుకుని ఎన్నికలకు రెండేళ్ల ముందే పార్టీ టికెట్ ఖరారు చేసుకున్న ఆయన.. ఆ తరువాత నియోజకవర్గంలో ఇళ్లు ఇళ్లూ తిరిగారని గుర్తు చేస్తున్నారు.
కార్యకర్తలంటే తనకు ప్రాణమని, పార్టీ అంటే దైవమన్నట్లు వ్యవహరించారని చెబుతున్నారు. ప్రతి ఒక్కరికీ ఎన్నో హామీలు ఇచ్చారని, పార్టీ కార్యకర్తలు తన ఆత్మబంధువులన్నట్లు వ్యవహరిస్తూ ఎన్నికల వరకు వారితో పనిచేయించుకున్నారని అంటున్నారు. ఆయనను నమ్మిన కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేసి అఖండ మెజార్టీతో గెలిపించుకున్నారని చెబుతున్నారు.
టీడీపీ ఆవిర్భావం తరువాత ఒకటి రెండు సార్లు మాత్రమే గెలిచిన ఆ నియోజకవర్గంలో పార్టీ గెలవడం అంత ఆషామాషీ విషయం కాదని, అదంతా కార్యకర్తలు, సానుభూతిపరుల కృషి వల్లే సాధ్యమైందని అంటున్నారు. ఇది పార్టీకి, గెలిచిన ఎమ్మెల్యేకి కూడా తెలుసని చెబుతున్నారు. అయితే గెలిచిన తరువాత ఆయన తీరు పూర్తిగా మారిపోయిందని ఆరోపిస్తున్నారు.
“తన సొమ్ముల వల్లే తాను గెలిచానని, కార్యకర్తలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు” అని విమర్శిస్తున్నారు. ఇంతకు ముందు కార్యకర్తలు కనిపిస్తే గంటలకొద్దీ వారితో సమయం గడిపిన ఈ నేత.. ఇప్పుడు మాత్రం వారు కనిపించినా పలకరించడం లేదని అంటున్నారు. వారిని చూసినా చూడనట్లు వెళ్లిపోతున్నారని పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
తమను పలకరిస్తే ఎక్కడ సొమ్ములు ఖర్చవుతాయో.. లేక ఏ పని అడుగుతారో అన్న భావనతోనే ఆయన కనీసం పలకరించడం లేదని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు అడిగిన వారికి, అడగని వారికి ఆర్థిక సహాయం చేసిన ఈ నేత.. ఎమ్మెల్యే అయిన తరువాత పూర్తిగా తన శైలిని మార్చుకున్నారని అంటున్నారు.
ఇతర పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీతో అత్యంత సన్నిహితంగా ఉంటూ.. నియోజకవర్గంలో ఆయనకు పెత్తనం అప్పగించారనే విమర్శలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, ఓ రాష్ట్ర మంత్రి ముగ్గురు ఒక జట్టుగా ఉంటూ తమ పనులు గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలు ఏదైనా చిన్న పని అడిగినా.. “మా వల్ల కాదు” అంటూ చేతులెత్తేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పని చేసినా చేయకపోయినా.. కనీసం పలకరింపులు కూడా లేవని పార్టీ కార్యకర్తలు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి.. సమీక్ష చేయాలంటున్న కార్యకర్తలు
వాస్తవానికి ఈ ఎమ్మెల్యే ఒక్కరే కాదు.. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా.. పలువురు ఎమ్మెల్యేలు తమ తీరును మాత్రం మార్చుకోవడం లేదని కార్యకర్తలు అంటున్నారు. రెండేళ్ల క్రితం ఎలా ఉన్న నాయకుడు.. ఇప్పుడు ఎలా మారిపోయాడో అంటూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఏమీ లేని వారు ఇప్పుడు వందల కోట్లు సంపాదించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రెండేళ్ల క్రితం వారి పరిస్థితి.. ఇప్పటి పరిస్థితి చూసి సామాన్య కార్యకర్త అవాక్కవుతున్నాడని అంటున్నారు.
“వీళ్లను ప్రాణాలకు తెగించి గెలిపిస్తే.. ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదు. తమపై ఉన్న కేసులను ఇప్పటివరకు తొలగించలేకపోయారు. ఒక్క చిన్న పని కూడా చేయించలేకపోతున్నారు” అంటూ కార్యకర్తలు ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికైనా వీరి తీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని కార్యకర్తలు కోరుతున్నారు.