ఉపాధ్యాయుల జోలికొస్తే ‘దబిడి దిబిడే’

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

స్థానిక సంస్థల ఎన్నికల్లో 94 శాతానికి పైగా స్థానాలు గెలవాలి

డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం.. జగన్ రెడ్డి సిద్ధమా?: మంత్రి నారా లోకేష్ సవాల్

రాప్తాడులో ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాల ఆవిష్కరణ.. నేషనల్ ఫైటర్ జెట్ ఏఎంసీఏ ప్రాజెక్టు జిల్లాకే సొంతం

పాఠాలు చెప్పే ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, వారి జోలికొస్తే 'దబిడి దిబిడే' అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. వైకాపా హయాంలో వైఫల్యాలు, డీఎస్సీ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, జగన్ రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు. అనంతపురం జిల్లా రాప్తాడు కూడలిలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు, మాజీ మంత్రి స్వర్గీయ పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆయన సోమవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. “పాఠాలు నేర్పే టీచర్లపై దాడి చేయడానికి రౌడీ మూకలను పంపడం ఏ రకమైన సంస్కృతి? టీచర్లపై కోడిగుడ్లు వేస్తూ, అసభ్యంగా మాట్లాడే తీరును తీవ్రంగా ఖండిస్తున్నా. చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కరిపై ‘రెడ్ బుక్’ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి” అని స్పష్టం చేశారు.

సిద్ధాంతం కోసం తుదివరకు పోరాడిన పరిటాల రవి

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల త్యాగాల పునాదులపైనే తాము ఈ రోజు వేదికలపై ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. "నేను ఇక్కడికి ఎన్టీఆర్ మనవడిగానో, చంద్రబాబు కుమారుడిగానో రా లేదు.. పసుపు జెండాను కాపాడిన ఒక సామాన్య కార్యకర్తగా వచ్చాను" అని తెలిపారు. రాయలసీమలో మహిళలు ధైర్యంగా బయట తిరిగేలా శాంతిభద్రతలను నెలకొల్పిన గొప్ప నాయకుడు పరిటాల రవీంద్ర అని, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడారని కొనియాడారు. రవి విగ్రహాన్ని, ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్ పుట్టినరోజు నాడే ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

అనంతకు ‘ఏఎంసీఏ’ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్

గత వైకాపా ప్రభుత్వ హయాంలో ‘జీవో 1’ ద్వారా తన యువగళం పాదయాత్రను అడ్డుకోవాలని చూశారని, మైకులు, స్టూళ్లు లాక్కున్నా కార్యకర్తల మద్దతుతో వెనక్కి తగ్గలేదని లోకేష్ గుర్తుచేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫైటర్ జెట్‌లను తయారుచేసే ‘ఏఎంసీఏ’ (AMCA) ప్రాజెక్టును అనంతపురం జిల్లాకు తీసుకువచ్చినట్లు ప్రకటించారు. రాయలసీమను సాగు, తాగునీటితో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు.

స్థానిక ఎన్నికల్లో 94% కంటే ఎక్కువ గెలవాలి

త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. "గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 94 శాతం స్థానాల్లో కూటమిని గెలిపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే నాలుగు గోడల మధ్య చర్చించుకుని పరిష్కరించుకోవాలి" అని సూచించారు. పాదయాత్రలో తనతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారథి, మంత్రి ఎస్.సవిత, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యేలు ఎం.ఎస్ రాజు, పల్లె సింధూర రెడ్డి, బండారు శ్రావణి, దగ్గుపాటి వెంకట ప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.