విజయానంద్ ఆరోగ్యంపై చర్చ.. సీఎంఓలో మార్పులు ఉంటాయా?
అమరావతిః సిఎంఓ కార్యాలయ అధికారి విజయానంద్ అనారోగ్యానికి గురికావడం, ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించడం పరిణామాల నేపధ్యంలో ఆయనను సిఎంఓలో కొనసాగిస్తారా? లేక ఆయన స్థానంలో ఎవరైనా యువకుడిని ఎంచుకుంటారా..? అనే సందేహాలు అధికార, రాజకీయవర్గాల్లో వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ట్ అయిన విజయానంద్‌ను తరువాత సర్వీసు పొడిగింపు ఇచ్చి మరీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయనను సిఎంఓలోకి తీసుకున్నారు. ఇది అధికార వర్గాలతో పాటు, రాజకీయవర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సుధీర్ఘకాలం ఇంధన రంగంలో పనిచేస్తోన్న విజయానంద్‌ను అప్పటి నుంచి అక్కడే కొనసాగిస్తున్నారు. అంతేనా ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైర్ అయిన తరువాత కూడా ఆయనను అదే పోస్టులో కొనసాగిస్తూ..తరువాత ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా ముఖ్య బాధ్యతలు అప్పగించారు. దీనిపై రాజకీయ, అధికార వర్గాల్లో అనేక విమర్శలు, ఆరోపణలు ఉన్నా..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఆయనపై నమ్మకంతోనే
ఆ బాధ్యతలు అప్పగించారనే మాట అధికారవర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అనారోగ్యానికి గురికావడంతో..ఇప్పుడు ఆయన బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ అధికారవర్గాలతోపాటు, కూటమి నేతల్లోనూ వ్యక్తం అవుతోంది. ఆయన ఆరోగ్యం సరిగా ఉంటే..మళ్లీ ఆయనే బాధ్యతలను నిర్వహిస్తారని, లేకుంటే..ఆయన స్థానంలో ఒక యువ ఐఏఎస్ అధికారిని కానీ...లేకుంటే..సీనియర్ ఐఏఎస్‌కు కానీ ఆ బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. అధికారుల నియామకంలో కూడా కులాల లెక్కలు చూసుకునే చంద్రబాబు విజయానంద్ స్థానంలో వేరే అధికారిని నియమించాలని భావిస్తే..విజయానంద్ సామాజికవర్గానికి లేదా బీసీ వర్గానికి చెందిన అధికారికే ప్రాధాన్యత ఇస్తారంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా పనిచేసిన ముద్దాడ రవిచంద్రను తిరుమల తిరుపతి దేవస్థానం ఇవోగా పంపించే ముందు ఆయన కులాల లెక్కలు చూసుకునే విజయానంద్‌కు అవకాశం ఇచ్చారంటున్నారు. ఇప్పుడు కూడా అదే రీతిలో ఉంటాయనే భావన ఉంది. కాగా రాష్ట్ర
ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేయడానికి కసరత్తులు చేస్తోంది. కొంత మంది జిల్లా కలెక్టర్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోవడం, మరి కొందరు శాఖాధిపతులు సరైన పనితీరు కనపర్చకపోవడం, కొన్ని శాఖల ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌లను బదిలీ చేయాలనే భావనతో ఉంది. బదిలీలు ఎప్పుడు చేసినా భారీగా చేస్తారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయినా, అధికారవ్యవస్థపై పట్టుసాధించలేదన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేయాలనే ప్రభుత్వం భావిస్తుంది. దీంతో..ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న విజయానంద్ ఆరోగ్యం సహకరించకపోతే...ఆయనస్థానంలో అదే వర్గానికి చెందిన అధికారికి అవకాశం ఉంటుందనే ఊహాగానాలు ఉన్నాయి. దీనితో పాటు సిఎంఓలో కూడా కీలక మార్పులు ఉంటాయంటున్నారు. కొన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులు, సిఎంఓ అధికారుల బదిలీల సందర్భంగా విజయానంద్‌ను కూడా తప్పిస్తారేమో చూడాలి?