విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు భారీ ఊరట.. రూ.25 లక్షలు, ఉద్యోగం ప్రకటించిన RINL

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

విశాఖపట్నం, జూన్ 9: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL) భారీ ఉపశమనం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

RINL విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి చట్టబద్ధమైన అన్ని టెర్మినల్ బెనిఫిట్స్‌తో పాటు రూ.25 లక్షల ప్రత్యేక ఆర్థిక సాయం అందజేయనున్నారు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించనున్నారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. గాయపడిన వారందరి వైద్య చికిత్స ఖర్చులను పూర్తిగా RINL భరిస్తుందని స్పష్టం చేసింది.

బాధిత కుటుంబాలకు ప్రత్యేక సౌకర్యాలు

మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలు ప్రస్తుతం నివసిస్తున్న స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్ క్వార్టర్స్‌లో ఉద్యోగి పదవీ విరమణ తేదీ వరకు కొనసాగేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చినట్లు RINL తెలిపింది. ఇది ప్రత్యేక మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయమని పేర్కొంది.

అదే కేటగిరీలోని మరో క్వార్టర్‌కు మారాలనుకుంటే కూడా అనుమతి ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం టౌన్‌షిప్ వెలుపల నివసిస్తున్న అర్హత కలిగిన కుటుంబాలకు కూడా అవసరమైతే క్వార్టర్స్ కేటాయిస్తామని తెలిపింది.

పిల్లల విద్యకు పూర్తి భరోసా

మృతి చెందిన ఉద్యోగుల పిల్లల విద్యకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది. RINL ఉద్యోగుల పిల్లలకు అందించే అన్ని విద్యా సౌకర్యాలు, ప్రయోజనాలు బాధిత కుటుంబాల పిల్లలకు కూడా యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు RINL ప్రకటించిన ఈ ప్యాకేజీ కొంత ఊరటనిచ్చే చర్యగా భావిస్తున్నారు.