ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి.. పార్టీ కోసం పోరాడిన నేతకు గుర్తింపు
అమరావతి, అక్టోబర్ 13: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి అలియాస్ గౌతమి శ్వేత కోటను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 23ను జారీ చేసింది. రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి భార్య అయిన స్వాతి రెడ్డికి ప్రభుత్వ పదవి దక్కడంపై టీడీపీ శ్రేణులు, ఆమె అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం, 1998లోని సెక్షన్ 5తో పాటు 2023లో చేసిన సవరణల ప్రకారం ప్రభుత్వం ఈ నియామకాన్ని చేపట్టింది. మహిళా కమిషన్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న సభ్యురాలి స్థానంలో ఆమెను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి రెండేళ్ల పాటు ఆమె పదవీకాలం కొనసాగనుంది. గవర్నర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎ. సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
వైకాపా ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం
గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్వాతి రెడ్డి అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేశారని టీడీపీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.అప్పట్లో స్వాతిరెడ్డి జగన్ను ఉద్దేశించి చేసిన తుగ్లక్బ్రో అనే వ్యాఖ్యలు సోషల్మీడియాలో హల్ చల్ చేశాయి. ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నా ఆయనకు భయపడకుండా..స్వాతిరెడ్డి చేసిన పోరాటం..సామాన్యమైంది కాదని ఆమె అభిమానులు అంటారు. రాజకీయంగా ఎదురైన విమర్శలు, దూషణలు, బెదిరింపులను ఎదుర్కొన్నప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా తన పోరాటాన్ని కొనసాగించారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావడానికి కూడా ఇబ్బందులు ఎదురైనట్లు ఆమె అభిమానులు చెబుతున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ధైర్యంగా నిలబడిన ఆమెకు ఇప్పుడు ప్రభుత్వ పదవి దక్కడం పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు లభించడమేనని వారు అభిప్రాయపడుతున్నారు.
బ్రహ్మం చౌదరి అస్వస్థత వేళ పదవి
ఇటీవల స్వాతి రెడ్డి, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరిని వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలం క్రితం బ్రహ్మం చౌదరి అస్వస్థతకు గురికావడంతో పార్టీ వర్గాలు, ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్న నేపథ్యంలో స్వాతి రెడ్డికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించడం వారి కుటుంబ సభ్యులు, అభిమానులకు సంతోషాన్ని కలిగించిందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచిన వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు అప్పగించడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచుతుందని వారు చెబుతున్నారు.
మహిళా కమిషన్లో కీలక బాధ్యతలు
మహిళల హక్కుల పరిరక్షణ, వారికి ఎదురయ్యే సమస్యల పరిష్కారం, మహిళా సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా నియమితులైన స్వాతి రెడ్డి కమిషన్లో తన బాధ్యతలను ఎలా నిర్వహిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. రాజకీయంగా పోరాట నేపథ్యం ఉన్న ఆమెకు మహిళల సమస్యల పరిష్కారంలోనూ చురుకైన పాత్ర పోషించే అవకాశం ఉందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.