పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన అంతం.. బీజేపీ చారిత్రాత్మక విజయం
భీమవరం, మే 05: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన అఖండ విజయంపై భీమవరంలో సంబరాలు మిన్నంటాయి. బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయంతో పాటు అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్డీయే (NDA) సుస్థిర పాలనకు ప్రజలు పట్టం కట్టడంపై కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నేతృత్వంలో సోమవారం భీమవరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి తోపాటు ఎన్డీయే కూటమికి చెందిన బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోమవారం ఉదయం బీజేపీ జిల్లా కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ఓవర్ బ్రిడ్జ్, ప్రకాశం చౌక్ మీదుగా జువ్వలపాలెం రోడ్డులోని అడ్డ వంతెన వరకు ఉత్సాహంగా సాగింది. ప్రకాశం చౌక్ వద్ద కార్యకర్తలు టపాసులు కాల్చి, మిఠాయిలు
పంచి సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కార్యకర్తలతో కలిసి కొద్దిసేపు డాన్స్ చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో అరాచక పాలనపై బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు. 2011లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని చోట, 2021లో 70 స్థానాలు సాధించి, ఇప్పుడు 208 స్థానాలతో భారీ విజయాన్ని అందుకోవడం పార్టీ పట్ల ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం అరాచకాలు, విధ్వంసకర ధోరణితో బంగ్లాదేశ్ చొరబాటుదారుల అండతో గెలవాలని చూసిందని, కానీ ప్రజలు ఆ కుట్రలను తిప్పికొట్టారని అన్నారు. కేంద్ర పథకాలను దుర్వినియోగం చేస్తూ, దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించిన వారికి బెంగాల్ ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. భారతీయ జనసంఘ్ స్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో బీజేపీ జెండా రెపరెపలాడటం గర్వకారణమని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో భవిష్యత్తులో బెంగాల్ అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆకాంక్షించారు. కేరళలో మూడు స్థానాలతో బీజేపీ అసెంబ్లీలో అడుగుపెట్టడం శుభపరిణామమని, తమిళనాడులో స్టాలిన్
పార్టీ ఓటమి చెందడం మహిళా బిల్లును వ్యతిరేకించిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వంలో దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతోందని, రాబోయే రోజుల్లో కేరళ, తమిళనాడులో కూడా బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయానికి కారకులైన నేతలకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలనకు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల మద్దతు పలకటం ఈ విజయాలకు నిదర్శనమని టిడిపి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, బిజెపి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి అన్నారు. బైక్ ర్యాలీ అనంతరం బైపాస్ రోడ్ లోని మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి విగ్రహానికి కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ బీజేపీ నాయకులతో కలసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ రామలింగరాజు, బొంబే స్వీట్ బాపిరాజు, బిజెపి నాయకులు కపర్ది, నార్ని తాతాజీ, కాయిత సురేంద్ర, పివి రాఘవులు, సాయి దుర్గ రాజు, శ్రీమతి సత్యవతి, షేక్ మొహుద్దీన్, గోవర్ధన్, అడబాల శివ, వబ్బిలిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.