వైకాపా నేతకు కనిపించిన అభివృద్ధి... టీడీపీ నేతలకు ఎందుకు కనిపించడం లేదు?

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. అభివృద్ధి, సంక్షేమం అనే ద్విచక్రాలపై పాలన సాగిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చామని, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షిస్తూ లక్షలాది ఉద్యోగాలకు మార్గం సుగమం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు కూటమి నేతలు చెబుతున్నారు.

గత రెండేళ్లలో రాష్ట్రానికి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు ప్రకటించాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పారిశ్రామిక పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వరుసగా జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతుండగా, రాజధాని అమరావతి నిర్మాణం కూడా మళ్లీ ఊపందుకుంది.

అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలులోనూ ప్రభుత్వం ముందంజలో ఉందని అధికార పక్షం పేర్కొంటోంది. తల్లికి వందనం, సామాజిక పెన్షన్లు, మత్స్యకార భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లలో భోజనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, టీడ్కో గృహాల పంపిణీ, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్, పేదలకు గృహనిర్మాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. గత వైకాపా ప్రభుత్వంతో పోలిస్తే మరింత విస్తృతంగా ఈ పథకాలు అమలవుతున్నాయని కూటమి నేతలు చెబుతున్నారు.

అయితే, ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమాంతరంగా అమలు చేస్తోందని చెబుతున్నప్పటికీ, అధికార కూటమికి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల్లో మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసంతృప్తికి అసలు కారణాలు ఏమిటన్నది స్పష్టంగా తెలియకపోయినా, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే అభిప్రాయం కొందరిలో వినిపిస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమన్వయంతో ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నప్పటికీ, అదే సమయంలో సొంత పార్టీకి చెందిన కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కొంత మేర దెబ్బతిన్నదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

ఎన్నికల సమయంలో కూటమి విజయం కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులకు తగిన గుర్తింపు లభించలేదనే భావన ఒకవైపు ఉండగా, మరికొందరు తమ వ్యక్తిగత పనులు జరగలేదనే కారణంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు టీడీపీ కూటమికి మద్దతుగా నిలిచిన కొందరు వ్యక్తులు ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, ప్రత్యర్థులతో సన్నిహితంగా వ్యవహరించడం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉందనే అభిప్రాయం ఏర్పడుతోందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.

అయితే, ఈ ప్రచారానికి భిన్నంగా ప్రతిపక్ష వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి తమ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం రాయలసీమలో లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతోందని, తమ ప్రభుత్వ హయాంలో ఆ స్థాయిలో అభివృద్ధి జరగలేదని అంగీకరించారు. ప్రస్తుతం రాయలసీమలో ఎటు చూసినా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఒక ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ప్రతిపక్ష నాయకుడికి కనిపిస్తున్న అభివృద్ధి... అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులకు ఎందుకు కనిపించడం లేదు?

నిజానికి రాష్ట్రంలో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయనేది ఒక వాస్తవం. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందనేదీ వాస్తవమే. అయితే ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడంలో కొందరు విఫలమవుతున్నారనే అభిప్రాయం రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం కంటే వ్యక్తిగత వ్యాపారాలు, ఇతర కార్యక్రమాలతో ఎక్కువగా బిజీగా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు సమర్థంగా చేర్చడంలో లోపం ఉండటమే అసంతృప్తి భావనకు ప్రధాన కారణమై ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా చూస్తే... ప్రతిపక్ష నేతకు కనిపిస్తున్న అభివృద్ధి సొంత పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులకు కనిపించకపోవడం నిజంగా రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామమే.